కల్యాణ్ సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  • Published By: madhu ,Published On : September 10, 2019 / 08:47 AM IST
కల్యాణ్ సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ చుట్టూ మళ్లీ బాబ్రీ మసీదు విధ్వంసం కేసు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై విచారణకు అనుమతివ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. ఐదేళ్లుగా ఆయన గవర్నర్‌గా రాజ్యాంగ పదవిలో ఉండడంతో..  ఈ కేసు విచారణ నుంచి ఆయన రక్షణ పొందగలిగారు. గవర్నర్‌గా పదవీ విరమణ చేసి 24 గంటలు గడవక ముందే..  సీబీఐ మళ్లీ పాత కేసును తిరగదోడి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

ముందే పసిగట్టిన కల్యాణ్‌ సింగ్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సీబీఐ కేసు తిరగదోడుతుందని భావించే ఆయన బీజేపీలో చేరిపోయారు. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన మరుక్షణమే కాషాయ కండువా కప్పుకున్నారు. 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా కల్యాణ్‌సింగే ఉన్న సంగతి తెలిసిందే. కూల్చివేత కుట్రలో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతితోపాటు కల్యాణ్‌సింగ్‌ పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. 1993లో ఆయనపై చార్జిషీటు దాఖలైంది.

ఇదే కాక..1984 నాటి సిక్కుల ఊచకోతకు సంబంధించిన ఓ కేసును తిరగదోడుతోంది. అప్పట్లో ఢిల్లీలోని ఓ గురుద్వారా వద్ద జరిగిన ఘర్షణలో ఇద్దరు సిక్కులు మరణించారు. కమల్‌నాథ్‌ నేతృత్వంలో మూకలే ఈ దాడికి పాల్పడ్డాయంటూ కేసు నమోదైంది. ఇద్దరు నిందితులను నేరస్థులుగా కోర్టు గుర్తించగా.. కమల్‌నాథ్‌ మాత్రం బయటపడ్డారు. దీంతో సాక్షులను మరోమారు ప్రశ్నించాలని పేర్కొంటూ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మంజీందర్‌ సింగ్‌ సిర్సా నేతృత్వంలోని బృందం…  కేంద్ర హోంశాఖకు అర్జీ పెట్టుకుంది. దీన్ని పరిశీలించిన హోంశాఖ..  దర్యాప్తు చేయాలంటూ సిట్‌ను ఆదేశించింది.