నాయనమ్మ కల నెరవేర్చబోతున్న జ్యోతిరాధిత్య సింధియా

  • Published By: venkaiahnaidu ,Published On : March 10, 2020 / 10:47 AM IST
నాయనమ్మ కల నెరవేర్చబోతున్న జ్యోతిరాధిత్య సింధియా

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో నాలుగైదు రోజుల నుంచి ఎక్కువగా వినిపిసిస్తున్న పేరు జ్యోతిరాధిత్య సింధియా. కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితులను తీసుకొచ్చాడు జ్యోతిరాధిత్య సింధియా. అసలు 2018 లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను తాను కాబోయే సీఎంగా ప్రొజెక్ట్ చేసుకున్న సింధియాకు కాంగ్రెస్ హైకమాండ్ అప్పట్లో ఊహించని షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి ఇండిపెండెంట్లు,ఎస్పీ,బీఎస్పీ అభ్యర్థులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్…సీఎం సీటుపై సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ని కూర్చోబెట్టింది.

అయితే అప్పటినుంచే కాంగ్రెస్ హైకమాండ్ పై కోపంగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా ఇప్పుడు అదునుచూసి కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి బీజేపీతో చేతులు కలిపాడు. అయితే జ్యోతిరాధిత్య కుటుంబానికి బీజేపీతో ఉన్న సంబంధాలు కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడినవేమీ కాదు. జ్యోతిరాధిత్య సింధియా…తన నాయనమ్మ విజయరాజే సింధియా(జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు) ఆశలను నెరవేర్చుతున్నాడు అంటూ మధ్యప్రదేశ్ రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఎందుకు అంటున్నారో చూద్దాం.

జ్యోతిరాధిత్య కుటుంబానికి బీజేపీతో సంబంధాలు
జ్యోతిరాధిత్య నాయనమ్మ విజయరాజే సింధియా. స్వాతంత్య్రానికి పూర్వం వీళ్ల కుటుంబం గ్వాలియర్ ప్రాంతాన్ని పాలించింది. 1957లో సింధియా కుటుంబ రాజకీయాలు మొదలయ్యాయి. 1957లో విజయరాజే కాంగ్రెస్ లో చేరి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957లో గుణ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్ సభలో అడుగుపెట్టింది విజయారాజే సింధియా. అయితే 1967లో ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జనసంఘ్ లో చేరింది. గ్వాలియర్ ప్రాంతంలో జనసంఘ్ ఎదుగుదలలో విజయరాజే సింధియా పాత్ర చాలా కీలకమైనది.

1971లోక్ సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ వేవ్ ని సైతం తట్టుకుని గ్వాలియర్ ప్రాంతంలోని మూడు లోక్ సభ స్థానాల్లో జనసంఘ్ విజయం సాధించిందంటే దాని వెనుక విజయరాజే పాత్ర చాలా కీలకమైనది. 1971లోక్ సభ ఎన్నికల్లో గుణ లోక్ సభ స్థానం నుంచి విజయరాజే కుమారుడు మాధవరాజే సింధియా(జ్యోతిరాధిత్య తండ్రి)విజయం సాధించారు. గ్వాలియర్ నుంచి వాజ్ పేయి లోక్ సభలో అడుగుపెట్టారు. బింద్ నుంచి విజయరాజే సింధియా ఎంపీగా విజయం సాధించారు.
బీజేపీతో బ్రేక్..కాంగ్రెస్ తో కంటిన్యూ
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సింధియా కుటుంబం చాలా కీలకంగా ఉన్న సమయమది. 26ఏళ్లకే మాధవరావు సింధియా ఎంపీ అయ్యారు. అయినప్పటికీ కాషాయపార్టీ ప్రేమకు సింధియా కుటుంబం నోచుకోలేదు. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జన్ సంఘ్ కు దూరంగా జరగాలని,కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాడు. 1980 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుణ స్థానం నుంచి పోటీ చేసి మూడోసారి లోక్ సభలో అడుగుపెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. మాధవరావు సింధియా వారసత్వాన్ని ఆయన కొడుకు జ్యోతిరాధిత్య సింధియా కంటిన్యూ చేశారు.
కుమార్తెలు మాత్రం బీజేపీతోనే
అయితే ఇదే సమయంలో విజయరాజే కుమార్తెలు వసుంధరారాజే,యశోధరా రాజే కూడా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. 1984లో బీజేపీలో చేరిన వసుంధరారాజే బీజేపీ జాతీయ కార్యనిర్వాహణ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా 8వ రాజస్థాన్ అసెంబ్లీలో దోల్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం వసుంధరారాజే కుమారుడు దుష్యంత్ రాజస్థాన్ జలావర్ లోక్ సభ నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇక యశోధరా రాజే మాత్రం 1977లో సిద్దార్థ్ బన్సాలీతో వివాహం అయిన తర్వాత అమెరికా వెళ్లిపోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి రాలేదు. 1994లో యశోధరా తిరిగి భారత్ కు వచ్చింది. 1998మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన యశోధరా రాజే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసింది.

జ్యోతరాధిత్య మాత్రం కాంగ్రెస్ తోనే..ఓటమి తర్వాత దూరం
అయితే మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాధిత్య మాత్రం కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతూ వచ్చాడు. 2001లో విమానప్రమాదంలో తండ్రి మాధవరావు సింధియా మరణం తర్వాత గుణ లోక్ సభ సీటు ఖాళీ అయింది. 2002లో గుణ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 4.5లక్షల ఓట్ల రికార్డు మెజార్టీతో తొలిసారిగా లోక్ సభలో అడుగుపెట్టాడు జ్యోతిరాధిత్య సింధియా. ఆ తర్వాత నుంచి వరుసగా మూడు సార్లు గుణ లోక్ సభ స్థానం నుంచి తిరుగులేని విజయంతో లోక్ సభలో అడుగుపెట్టన జ్యోతిరాధిత్యకు 2019లో మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మోడీ వేవ్ ని తట్టులేకలేక 2019లో ఓడిపోయాడు జ్యోతిరాధిత్య సింధియా. ఈ ఓటమి జ్యోతరాధిత్యకు రెండవ ఎదురుదెబ్బగా చూడవచ్చు. 2019లోక్ సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ సీఎం రేసు నుంచి తప్పొంచబడినప్పుడు ఒక ఎదురుదెబ్బ. లోక్ సభ ఎన్నికల్లో మరో ఎదురుదెబ్బను చవిచూశాడు జ్యోతిరాధిత్య. కేవలం జ్యోతిరాధిత్య 23మంది ఎమ్మెల్యేల సపోర్ట్ మాత్రమే పొందటంతో కలమ్ నాథ్ కు సీఎం సీటు అప్పగించిన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సింధియాకు టైం వస్తుంది అని మాత్రమే చెప్పాడు.
బీజేపీ వైపు చూపులు
లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన జ్యోతిరాధిత్య అప్పటి నుంచి… తన వర్గంలోని ఆరుగురు ఎమ్మెల్యేలకు కమల్ నాథ్ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నుంచి సైడ్ అయ్యాడు. కాంగ్రెస్ తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చాడు. అప్పడప్పుడు సొంత పార్టీపైన,ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించడం,పలు విషయాల్లో బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చాడు. 2019 జనవరిలోనే శివరాజ్ సింగ్ చౌహాన్,జ్యోతిరాధిత్య సింధియా కలిసి కొద్దిసేపు చర్చించినప్పుడు సింధియా ఇక బీజేపీలోకి వెళ్లబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే 2019 సెప్టెంబర్ లో బీజేపీలోకి జ్యోతిరాదిత్య వెళ్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాను కాంగ్రెస్ లో కొనసాగుతానని అప్పట్లో జ్యోతిరాధిత్య సింధ్ ఆ పుకార్లకు చెక్ పెట్టారు. 
కాంగ్రెస్ కు రాజీనామా
గతేడాది నవంబర్ లోనే ట్విట్టర్ నుంచి కాంగ్రెస్ మనిషిగా వైదొలిగి తనను తాను ప్రజాసేవకుడు,క్రికెట్ అభిమానిగా గుర్తుచేస్తూ వచ్చిన సింధి ఇప్పుడు 2020మార్చిలో బీజేపీలో వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. మార్చి-9,2020 నాటికి జ్యోతిరాధిత్య వర్గంలోని 17మంది ఎమ్మెల్యులు బెంగళూరుకి వచ్చి అటు నుంచి నేరుగా బీజేపీతో చేతులు కలిపేందుకు రెడీ అయ్యారు.

మార్చి-10,2020న జ్యోతిరాధిత్య తన కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక తర్వలో ఆయన బీజేపీ కేంద్ర కేబినెట్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా ఇప్పుడు కలమ్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక త్వరలోనే మధ్యప్రదేశ్ లో సింధియా మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయంగా కనిపిస్తోంది.

See Also | షాకింగ్ న్యూస్ : డెడ్ బాడీని తెచ్చి కూర వండేసిన మందుబాబు!!