ముకేష్ అంబానీ మరో ఘనత…సంపదలో ఎలాన్‌ మస్క్ ను వెనక్కి నెట్టిన రిలయన్స్ చైర్మన్

  • Published By: venkaiahnaidu ,Published On : July 14, 2020 / 08:22 PM IST
ముకేష్ అంబానీ మరో ఘనత…సంపదలో ఎలాన్‌ మస్క్ ను వెనక్కి నెట్టిన రిలయన్స్ చైర్మన్

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, భార‌త్‌లో నెం. 1 ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించారు.ప్రస్తుతం ముకేష్ అంబానీ సంపద ఇప్పుడు సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, అలాగే గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ నికర విలువను దాటేసింది. దీంతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో ఆరో సంపన్న వ్యక్తిగా‌ అవతరించారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం… రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ నికర విలువ 72.4 బిలియన్ డాలర్లు. ఎలాన్ మాస్క్ నికర విలువ 68.6 బిలియన్ డాలర్లు కాగా, లారీ పేజ్ సంపద ప్రస్తుతం 71.6 బిలియన్ డాలర్లు కాగా, బ్రిన్స్ సంపద 69.4 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, ముకేశ్ అంబానీ గత వారమే ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ప్రముఖ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టిన విషయం తెలిసిందే.

మార్చి నుంచి ఇప్పటివరకు రిల‌య‌న్స్‌ సంస్థ షేర్ల విలువ రెట్టింపునకు పైగా పెరిగింది. గత శుక్రవారం రిలయన్స్‌ మార్కెట్‌ విలువ కూడా రూ.12 లక్షల కోట్లను దాటేసింది.

భారత్‌లో కొవిడ్‌ ప్రభావం మొదలైన తొలి రోజుల్లో రిలయన్స్‌ షేర్ల విలువ బాగా తగ్గింది. కానీ టెలికాం యూనిట్ జియో ప్లాట్‌ఫామ్‌లకు ఫేస్‌బుక్, కెకెఆర్, ఇంటెల్ సహా పలువురు ప్రపంచ పెట్టుబడిదారుల నుండి నిధులు వచ్చిన తరువాత మార్చి నుండి ఆర్‌ఐఎల్ షేర్ విపరీతంగా ధర పెరిగింది. మార్చి నుంచి ఇప్పటివరకు షేర్ వాల్యూ 120 శాతం పెరిగింది.

దీనికి తోడు 2021 మార్చి 31 నాటికి రిలయన్స్ గ్రూపు రుణ రహిత కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నిర్ణీత తేదీ కంటే ముందే కంపెనీ నికర రుణ రహిత సంస్థగా మారి భారత కార్పోరేట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తలుపులు తెరిచింది. ఇది కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపి షేర్ విలువ పెరుగ‌డానికి కార‌ణ‌మైంది.