రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన: 101 వస్తువుల దిగుమతిపై ఆంక్షలు

  • Published By: vamsi ,Published On : August 9, 2020 / 10:39 AM IST
రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన: 101 వస్తువుల దిగుమతిపై ఆంక్షలు

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అతి పెద్ద ప్రకటన చేశారు. స్వావలంబన భారతదేశం ప్రచారానికి మద్దతుగా 101 వస్తువుల దిగుమతిపై ఆంక్షలను విధించినట్లు ప్రకటించారు. దిగుమతి నిషేధించిన 101 వస్తువుల జాబితాను రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది.

స్వావలంబన వైపు ఇది ప్రధానమైన అడుగు అని ఆయన ప్రకటించారు. లడఖ్‌లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తత మధ్య రక్షణ మంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, 101 కి పైగా వస్తువులపై దిగుమతి పరిమితులను ప్రవేశపెడుతున్నట్లు రక్షణ మంత్రి ట్వీట్‌లో చేశారు. ఈ 101 వస్తువులలో సులభ వస్తువులు మాత్రమే కాకుండా ఆర్టిలరీ గన్స్, అటాల్ట్ రైఫిల్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఎల్‌సిహెచ్‌లు, రాడార్లు మరియు మన రక్షణ సేవలకు అవసరమైన అనేక ఇతర వస్తువులు ఉన్నాయి.

2020 నుంచి 2024 మధ్య కాలంలో క్రమంగా దిగుమతులపై నిషేధాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికతో కేంద్రం ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.

రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ రూపొందించిన జాబితాను భారత సైన్యం, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలతో చర్చించిన తరువాత తయారు చేసినట్లు రక్షణ మంత్రి చెప్పారు.

ఉత్పత్తుల కోసం 2015 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్ట్ మధ్య సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చినట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 6 నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమకు సుమారు రూ .4 లక్షల కోట్లు ఆర్డరు ఇవ్వనున్నారు.