ఇదోరకం వర్క్ ఫ్రమ్ హోమ్ : అద్దెకు ల్యాప్‌టాప్‌లు తీసుకుని ఆన్‌లైన్‌లో అమ్మకాలు

ఇదోరకం వర్క్ ఫ్రమ్ హోమ్ : అద్దెకు ల్యాప్‌టాప్‌లు తీసుకుని ఆన్‌లైన్‌లో అమ్మకాలు

Bangalore gang crime Rent laptops for sale online : వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆఫీసు పనిని ఇంట్లో చేయటం. కరోనాతో వచ్చిన లాక్ డౌన్ తో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేశారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వర్క్ ఫ్రం హోమే. కానీ చాలా డిఫరెంట్. ఈ వర్క్ ఫ్రం హోమ్ లో కష్టపడకుండా డబ్బు సంపాదించటం ఎలా? ఇతరుల్ని మోసం చేసిన డబ్బుల్ని ఎలా సంపాదించాలి? అనే కాన్సెప్ట్ తో జరిగింది. నలుగురు ఇంజీనీరింగ్ డ్రాపౌట్స్ యువకులు తేలిగ్గా డబ్బు సంపాదించటం కోసం వేసిన ఎత్తులే ఈ వర్క్ ఫ్రం హోమ్.


వివరాల్లోకి వెళితే.. ఇంజనీరింగ్‌ డ్రాపౌట్స్ అయిన నలుగురు కుర్రాళ్లు వాళ్ల తెలివితేటల్ని చెడు మార్గంలో ఉపయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం కొత్త మోసాన్ని తెరపైకి తెచ్చరాు. కరోనా ప్రభావంతో వచ్చిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను తమ మోసాలకు అడ్డాగా చేసుకున్నారు.


నకిలీ ఐటీ కంపెనీని సృష్టించారు. భారీగా ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకున్నారు. ఆ తరువాత వాటిని ఐటీ హబ్స్‌నే టార్గెట్‌గా చేసుకు తక్కువ ధరకే సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌లు అంటూ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు.దీంతో చాలామంది వీటిని కొనుక్కోవటంతో దండిగా సొమ్ములు చేతికొచ్చాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూర్‌లోనూ నేరాలకు పాల్పడింది. వీరి గుట్టురట్టు చేసిన అక్కడి బైపనహల్లి పోలీసులు ముగ్గురు పట్టుకుని లోపలేశారు. వీళ్లలో ఓ నిందితుడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారు.


బెంగళూర్‌లోని కమ్మనహల్లి ప్రాంతానికి చెందిన సైఫ్‌ పాషా ఈ ముఠాలో మెయిన్ క్యారెక్టర్. వీరప్పనపాల్య, హెన్నూర్‌ బాండే వాసులైన మొయినుద్దీన్‌ ఖురేషీ, ప్రతీక్‌ నాగర్కర్, అశ్వఖ్‌లతో ఓ ముఠాను తయారు చేశాడు. ఈ నలుగురూ ఇంజనీరింగ్‌ ను మధ్యలో వదిలేసినవారే. కొన్నాళ్ల క్రితం చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసిన ఎటువంటి ఫలితం లేకపోగా తీవ్రంగా నష్టపోయారు. కరోనా ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ల్యాప్‌టాప్‌లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ల్యాప్‌టాప్‌లను అద్దెకు ఇచ్చే సంస్థలు పోటీ పడి మరీ అద్దెకివ్వడం ప్రారంభించాయి. ఇది గమనించిన సైఫ్‌కు కొత్త ఆలోచన వచ్చింది.

బెంగళూర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ ఇటువంటి పరిస్థితే ఉంటుందని గుర్తించాడు. దీంతో కొత్త మోసాలకు తెరతీస్తూ..రెండుచోట్లా వేర్వేరు ముఠాలను ఏర్పాటు చేశాడు. ముందుగా వీరు రెండుమూడు నకిలీ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేశారు. వాటి పేరుతో లెటర్‌హెడ్‌లు తయారు చేశారు. వీటి సాయంతో పలు సంస్థల నుంచి ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకున్నారు.

అద్దెకు ఇచ్చే వారికి అడ్వాన్స్‌గా పోస్ట్‌ డేటెడ్‌ చెక్కుల్ని ఇచ్చారు. ఇలా తమకు చిక్కిన ల్యాప్‌టాప్‌లను సైఫ్‌ ముఠా ఆన్‌లైన్‌లో అమ్మటం మొదలుపెట్టింది. కరోనా ప్రభావంతో తమ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని మూసేస్తున్నామని.. అందుకే తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లను సెకండ్‌ హ్యాండ్‌లో అమ్ముతున్నామని ప్రచారం చేసుకున్నారు. దీంతో అమ్మకాలు బాగానే జరిగగా..డబ్బులు బాగానే చేతికొచ్చాయి.

ఈ ముఠా చేతిలో మోసపోయిన ల్యాప్‌టాప్‌ అద్దెకు ఇచ్చే సంస్థలు బెంగళూర్‌లోని మదివాల, సంపిగహెల్లీ, అశోక్‌నగర్, ఆర్టీ నగర్, మరథహల్లీ, జేపీ నగర్‌లతో పాటు హైదరాబాద్‌లోని సీసీఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఈ ముఠాకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్‌ పోలీసులు.

అనంతరం ఈ ముఠాకు అసలు సూత్రధారి సైఫ్‌ కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరోపక్క ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న బెంగళూర్‌లోని బైపనహెల్లీ పోలీసులు గత సోమవారం (డిసెంబర్ 7,2020) సైఫ్‌తో పాటు మొయినుద్దీన్, ప్రతీక్‌లను పట్టుకుని అరెస్ట్ చేశారు. రూ.45 లక్షల విలువైన 97 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.


దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్‌ పోలీసులు బెంగళూర్‌ చేరుకుని సైఫ్‌ను తమ కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. పరారీలో ఉన్న అశ్వఖ్‌ కోసం గాలిస్తున్నారు.