OTP TRAI : బ్యాంకు లావాదేవీల్లో కొత్త మార్పులు..OTP‌కు ట్రాయ్‌ బ్రేక్‌

గత ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్‌ చేస్తేనే... OTPలు పంపిస్తామని ట్రాయ్‌ తేల్చి చెప్పింది.

OTP TRAI : బ్యాంకు లావాదేవీల్లో కొత్త మార్పులు..OTP‌కు ట్రాయ్‌ బ్రేక్‌

bank account holders

bank account holders : ఎట్టి పరిస్థితుల్లో మీ OTPని ఇతరులకు చెప్పవద్దు. షేర్‌ చేయవద్దు.. బ్యాంకుల నుంచి పదేపదే వచ్చే సందేశం ఇది! అయినప్పటికీ… అనేకమంది సైబర్‌ నేరగాళ్లు విసిరిన వలలో పడుతూనే ఉన్నారు. ఓటీపీ చెప్పేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఓటీపీ, సంబంధిత ఎస్సెమ్మెస్‌లు ఇప్పుడున్న ఫార్మాట్‌లో పంపడం వల్ల సైబర్‌ నేరాలకు అవకాశమున్నందున టెలికామ్‌ రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ఒక కొత్త ఫార్మాట్‌ను రూపొందించింది. ఈ ఫార్మాట్‌ వల్ల నకిలీ, తప్పుడు SMSలు బ్యాంకుల పేరుతో వినియోగదారులకు వెళ్లే అవకాశం ఉండదు. ఈ కొత్త ఫార్మాట్‌లోకి అప్‌డేట్‌ కావాలని కొన్నేళ్ల నుంచి బ్యాంకులకు ట్రాయ్‌ చెబుతూనే ఉంది. అయితే, బ్యాంకులు ఎప్పటికప్పుడు దీనిని వాయిదా వేస్తున్నాయి.

గత ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్‌ చేస్తేనే… OTPలు పంపిస్తామని ట్రాయ్‌ తేల్చి చెప్పింది. దాదాపు 24 గంటలపాటు ఓటీపీ సందేశాలను నిలిపివేసింది. బ్యాంకులు మరికొంత గడువు కోరడం… ట్రాయ్‌ అందుకు అంగీకరించడం… ఇలా కాలం గడుస్తూ వచ్చింది. అయితే, ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి ఖచ్చితంగా బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని… లేకుంటే మాత్రం ఓటీపీలు, SMSలు ఆపేస్తామని ట్రాయ్‌ హెచ్చరించింది. అప్పటికి కూడా బ్యాంకులు తమ చెల్లింపుల విధానాన్ని అప్‌డేట్‌ చేసుకోకపోతే… వినియోగదారులకు తాత్కాలికంగానైనా ఇబ్బందులు తప్పవు!

మరోవైపు బ్యాంకుల విలీనంతో ఐఎ‌ఫ్‌ఎ‌స్‌సీ (IFSC) కోడ్‌ రూపంలో ఖాతాదారులకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవల ఆంధ్రాబ్యాంకును యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కలిపేశారు. దీంతో… ఆంధ్రాబ్యాంకు శాఖల IFSC కోడ్‌లన్నీ మారిపోయాయి. కొత్త బ్యాంకు ఐఎ‌ఫ్‌ఎ‌స్‌సీ కోడ్‌ ఏదో వినియోగదారులకు తెలియడంలేదు. నెట్‌లో వెతికి లేదా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకునే అవగాహన కూడా అందరికీ ఉండదు. దీంతో… పాత ఐఎ‌ఫ్‌ఎ‌స్‌సీ కోడ్‌ ఇవ్వడం, చెల్లింపులు జరగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. బ్యాంకులే ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది.

సైబర్‌ నేరాలకు చెక్‌ చెప్పేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటోమేటిక్‌గా జరిగే చెల్లింపుల విధానంలో మార్పులు చేశారు. ప్రతినెలా కట్టే ఇంటి రుణం వాయిదా నుంచి టెలిఫోన్‌ బిల్లు వరకు… వాటంతట అవే ఖాతా నుంచి చెల్లింపులు జరిగేలా స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తుంటారు. ఇకపై… వేటికిపడితే వాటికి ఆటోమేటిక్‌ చెల్లింపులు కుదరవు. ఇంటి రుణం, వాహన రుణం, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎల్‌ఐసీ వంటి కొన్ని సేవలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఓటీటీ సేవలు, డీటీహెచ్‌ బిల్లులు, ఫోన్‌ బిల్లులు వంటి సేవలకు ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరగవు. ఇలాంటి సేవలకు ఖాతాదారులు ఇచ్చిన స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఏప్రిల్‌ 1 నుంచి డీయాక్టివేట్‌ అవుతాయి.

పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు మెయిల్స్‌ రూపంలో ఈ సమాచారం పంపించాయి. ఇకపై ఇలాంటి సేవలకు బిల్లులు చెల్లించాలంటే ఆయా కంపెనీల వెబ్‌సైట్‌ లేదా యాప్‌ల ద్వారా చెల్లించుకోవాల్సిందే. క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ద్వారా మీరు చెల్లింపులు చేసుకోవడంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే… ఈ చెల్లింపులకు మళ్లీ ఓటీపీ అవసరమవుతుంది. బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడంపైనే ఈ లావాదేవీలు సక్సెస్‌ అయ్యే అవకాశముంది.