సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాల మద్దతు

  • Published By: venkaiahnaidu ,Published On : November 24, 2020 / 11:30 PM IST
సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాల మద్దతు

AIBEA to join trade unions in nationwide general strike కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపిస్తూ.. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఈ సమ్మెలో తాము పాలుపంచుకుంటామని పలు రంగాలకు చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.



కార్మిక చట్టాలను కాలరాస్తూ.. కార్పొరేట్ల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆరోపిస్తూ.. పలు కార్మిక సంఘాలు నవంబర్ 26న ఒకరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు జాతీయ కార్మిక సదస్సులో భాగంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) మినహా పది కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి



ఈ సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు నవంబర్‌ 26న జరగనున్న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తామూ పాల్గొంటామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించింది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయించామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది



కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన లోక్‌సభ​ సెషన్లో ‘ఈజీ ఆఫ్ బిజినెస్’ పేరిట మూడు కొత్త కార్మిక చట్టాలను ఆమోదించిందని, ప్రస్తుత 27 చట్టాలను తుంగలో తొక్కి పూర్తిగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ కొత్త చట్టాలను తీసుకొస్తోందని ఏఐబీఈఏ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. తద్వారా 75 శాతం మంది కార్మికులను చట్టపరిధిలోంచి తప్పించి వారికి రక్షణ లేకుండా కేంద్రం చేస్తోందని ఆరోపించింది. ఈ చట్టాల ద్వారా కార్పొరేట్లకే తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలూ లేవని మండిపడింది.