Karnataka CM: కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం.. బొమ్మైకి కలిసొచ్చిన అంశాలు

కర్ణాటక సీఎంగా మాజీ సీఎం తనయుడు బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బొమ్మైతో రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ప్రమాణం చేయించారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి సీఎం పీఠం దక్కింది.

Karnataka CM: కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం.. బొమ్మైకి కలిసొచ్చిన అంశాలు

Karnataka Cm

Karnataka CM: కర్ణాటక సీఎంగా మాజీ సీఎం తనయుడు బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బొమ్మైతో రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ప్రమాణం చేయించారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి సీఎం పీఠం దక్కింది. ఎస్‌ఆర్‌ బొమ్మై కొడుకైన బసవరాజును తాజాగా మాజీ అయిన యడియూరప్ప కూడా సీఎం అభ్యర్థిగా సూచించారు. ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజువైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును కన్ఫామ్ చేశారు.

బసవరాజు బొమ్మైకు కలిసివచ్చిన అంశాలు..
* ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకోవడం.
* పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటం.
* లింగాయత్ వర్గానికి చెందిన నేత కావడం.

రాజకీయ జీవితం:
మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కొడుకైన బసవరాజ్ జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికై.. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో బీజేపీలో చేరిన ఆయన.. గతంలో జలవనరుల శాఖ మంత్రిగానూ సేవలందించారు. భారత్‌లో మొట్టమొదటిసారిగా షిగ్గావ్‌లో నిర్మించిన 100శాతం పైప్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆయన కీలక పాత్ర పోషించారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు.

వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన బసవరాజ్ బొమ్మై… కెరీర్ ఆరంభంలో టాటా గ్రూప్ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. భార్య చెన్నమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. లింగాయత్ వర్గానికే సీఎం పదవిని కట్టబెట్టాలా మరో సామాజికవర్గంతో ప్రయోగం చేయాలా అనే తర్జనభర్జన పడి బీజేపీ అధిష్ఠానం చివరకు లింగాయత్‌ వర్గానికే చెందిన బసవరాజ్ బొమ్మై వైపే మొగ్గుచూపింది. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్ప వీరశైవ లింగాయత్ వర్గానికి చెందినవారు కాగా బసవరాజ్ బొమ్మై సదర లింగాయత్ వర్గానికి చెందినవారు.

లింగాయత్ వర్గానికే:
1956 నుంచి ఇప్పటివరకూ 20 మంది నేతలు కర్ణాటక ముఖ్యమంత్రులుగా వ్యవహరించగా.. ఇందులో 8 మంది లింగాయత్‌ వర్గానికి చెందినవారే ఉన్నారు. కన్నడ నాట.. రాజకీయంగా ప్రభావవంతమైన శక్తిగా లింగాయత్‌ వర్గం ఎదిగింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. అందులో 140 నియోజకవర్గాల్లో లింగాయత్‌ సమాజం కీలకంగా ఉంది. రాష్ట్ర జనాభాలో లింగాయత్ ల జనాభా దాదాపు 17 శాతంగా ఉండటం.. దశాబ్దాలుగా బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా ఉండటం బసవరాజు బొమ్మైకి కలిసొచ్చిన అంశాలుగా చెబుతున్నారు.

సీఎం పదవి రేసులో అరవింద్‌ బెల్లాద్‌, బసన్నగౌడ పాటిల్‌, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చినప్పటికీ చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. ఎమ్మెల్యేల నిర్ణయంతో.. బసవరాజ్ బొమ్మైకే బీజేపీ అధిష్ఠానం కూడా మొగ్గుచూపింది.