Legislative Council In Bengal : బెంగాల్ లో శాసనమండలి ఏర్పాటు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 కింద పశ్చిమ బెంగాల్ లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది.

Legislative Council In Bengal :  బెంగాల్ లో శాసనమండలి ఏర్పాటు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

Mamata

Legislative Council In Bengal రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 కింద పశ్చిమ బెంగాల్ లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది. టీఎంసీ నేత,మంత్రి పార్థ ఛటర్జీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 196 మంది అనుకూలంగా ఓటేశారు. 69 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు సహా.. ఏకైక ఐఎస్​ఎఫ్​ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.

మండలి ఏర్పాటు కోసం తీర్మాణాన్ని బీజేపీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకుడు, బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ… శాసనమండలిని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంపై అపారమైన ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన టీఎంసీ నాయకులను చట్టసభ్యులుగా చేయడానికే శాసన మండలిని తీసుకొస్తున్నారన్నారు. చట్టం ప్రకారం ఈ తీర్మాణానికి లోక్ సభ,రాజ్యసభ ఆమోదం తెలపాలన్నారు. పార్లమెంట్ లో బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుందన్నారు. లోక్ సభలో బీజేపీకి 300కి పైగా సభ్యుల బలం ఉందని..అక్కడ కూడా బీజేపీ ఈ తీర్మాణాన్ని వ్యతిరేకిస్తామన్నారు. బెంగాల్ అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్ల ప్రయోజనం ఏంటని సువెందు ప్రశ్నించారు.

కాగా, ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్​ నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మళ్లీ సీఎంగా మమత బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యేలుగా గెలవని వారు ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లోగా తిరిగి శాసన సభకు లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నవంబరు 4లోగా ఎమ్మెల్యేగా మమత ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా మూడో ఉద్ధృతి రావచ్చనే ఆందోళన నేపథ్యంలో బెంగాల్‌లో ఖాళీగా ఉన్న భవానీపుర్‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముందుకు రాకపోతే ఉత్తరాఖండ్​ సీఎంగా తప్పుకున్న తీరథ్‌ మాదిరి పరిస్థితే ఆమెకు ఎదురు కావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఎప్పుడో రద్దయిన శాసన మండలిని మళ్లీ పునరుద్ధరించాలని మమత డిసైడయ్యారు. ఆ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం శాసనసభలో ఆమోదం లభించింది. 1969 మార్చి 21వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో శాసన మండలి అవసరం లేదంటూ రద్దు చేశారు. అప్పటి నుండి ఏ ప్రభుత్వం వచ్చినా మండలి ఏర్పాటు ఆలోచన చేయలేదు.

కాగా, బెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మాణానికి పార్లమెంట్(లోక్ సభ,రాజ్యసభ)ఆమోదం లభిస్తే.. చట్టం ప్రకారం పశ్చిమ బెంగాల్ శాసనమండలిలో గరిష్టంగా 94 మంది సభ్యులను కలిగి ఉండవచ్చు (మొత్తం అసెంబ్లీ స్థానాల్లో మూడింట ఒక వంతు).