లాక్ డౌన్ వేళ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ ఎంపీ 

10TV Telugu News

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే పశ్చిమ బెంగాల్ లో ఒక బీజేపీ ఎంపీ రోడ్డు మీద బైఠాయించారు. తన సొంత నియోజక వర్గంలో ప్రజలకు సేవ  చేసేందుకు పోలీసులు అనుమతించటం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన తెలిపారు.

పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ్ దీనాజ్ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుకుంటా మజుందార్ ను లాక్ డౌన్ కారణంగా తన సొంత నియోజక వర్గంలోకి పోలీసులు అనుమతించటం లేదు. గత 20 రోజులుగా ఆయన నియోజక వర్గంలోకి వెళ్దామంటే పోలీసులు అడ్డుకుంటున్నారు.

ప్రజలకు సేవ చేసేందుకు సొంత నియోజక వర్గానికి మంగళవారం, ఏప్రిల్ 28న  వెళ్తుంటే పోలీసులు అయన్ను ఆపి వేశారు. దీంతో ఆయన  నడిరొడ్డుపై బైఠాయించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తనపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.

దీనిపై అధికార తృణమూల్ నేతలు మాట్లాడుతూ… బీజేపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందుకే వారిని అనుమతించటంలేదని తెలిపారు.  కాగా …ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే తాము విధులు నిర్వర్తిస్తున్నామని పోలీసులు చెప్పారు.