west bengal election 2021 : ఎన్నికల సిబ్బంది బస్సుకు నిప్పు..హై టెన్షన్

west bengal election 2021 : ఎన్నికల సిబ్బంది బస్సుకు నిప్పు..హై టెన్షన్

Bengal

Assam, West Bengal Election : ఉద్రిక్తతల మధ్య పశ్చిమబెంగాల్ తొలి దశ పోరు కొనసాగుతోంది. ఓటింగ్‌కు ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. బస్సుకు నిప్పు పెట్టడంపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు టీఎంసీ ఎంపీలు. తూర్పు మిడ్నాపూర్‌లో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. సత్సామాల్ బాగ్‌వాన్‌పూర్‌ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. అర్గోల్ పంచాయతీలో టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నారని బీజేపీ నేత అనూప్ చక్రవర్తి ఆరోపించారు.

మరోవైపు కోల్‌కతాలో 22 క్రూడ్‌ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఖేజురిలో బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదారు. పటాష్‌పూర్‌లో భద్రతా సిబ్బందిపై దాడి జరిగింది. దీంతో పోలింగ్‌ బూతుల్లో భారీగా భద్రతాదళాలను మోహరించారు. 9 గంటల వరకు ఐదు జిల్లాల్లో 7.72 శాతం పోలింగ్ నమోదైంది. వెస్ట్ మిడ్నాపూర్‌లో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఎంసీ అభ్యర్థి సుశాంత ఘోస్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సుశాంత కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సుశాంత ఘోస్‌ను అక్కడి నుంచి తరలించారు.

బెంగాల్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఐదు జిల్లాల్లో వెస్ట్ మిడ్నాపూర్, ఈస్ట్ మిడ్నాపూర్‌లో మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. ఖారగ్‌పూర్‌లో ఉదయం ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. దీంతో రెండు గంటలకు పైగా ఓటర్లు క్యూలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని…ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం మమత బెనర్జీ ట్వీట్ చేశారు.

మరోవైపు అధికార టీఎంసీ, బీజేపీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తూర్పు మిడ్నాపూర్‌లో తెల్లవారుజామున కొందరు డబ్బులు పంచారని టీఎంసీ ఆరోపించింది. డబ్బులు పంచిన వారు స్థానికులు కాదని…బయటి నుంచి వచ్చారన్నారు. ఓటింగ్ జరుగుతున్న జిల్లాల్లో టీఎంసీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. పురిలియాలో టీఎంసీ నేత మాజీ మంత్రి ఓటర్లకు క్యాష్ ఇచ్చారని ఆరోపించింది. నందిగ్రామ్‌లో ఓటర్ల భద్రతపై తృణముల్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఓటర్లను బెదిరిస్తున్నారని… కొంతమంది క్రిమినల్స్ నందిగ్రామ్‌లో కొన్ని రోజులుగా మకాం వేశారని ఈసీకి ఫిర్యాదు చేసింది టీఎంసీ.

తొలి విడత పోల్‌ ఫైట్‌కు.. బెంగాల్‌, అస్సాం సిద్ధమయ్యాయి. బెంగాల్‌లో 30, అస్సోంలో 47 స్థానాల్లో జరగనున్న ఫస్ట్‌ ఫేజ్‌ ఓటింగ్‌ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. బెంగాల్‌లో 73 లక్షల మంది.. అస్సాంలో 81 లక్షలకు పైగా ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.