బెంగాల్ దంగల్ : దీదీ రాజ్యాన్ని కూలగొడుతారా ? బీజేపీ వ్యూహాలు

బెంగాల్ దంగల్ : దీదీ రాజ్యాన్ని కూలగొడుతారా ? బీజేపీ వ్యూహాలు

Bengal elections : క్షణక్షణం ఉత్కంఠను తలపిస్తున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నా బెంగాల్‌ శాసనసభలో హ్యాట్రిక్ కొట్టలాని తృణమూల్‌ కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో తూర్పు భారతంలోనే పెద్ద రాష్ట్రమైన బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడించాలని కమలం పట్టుదలతో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పుంజుకున్న బీజేపీ… శాసనసభ ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. బెంగాల్‌ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్‌ కమ్యునిస్టులు… తర్వాత కాంగ్రెస్‌ వర్సెస్‌ మమతాబెనర్జీగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్‌ పక్కకుపోయింది. కామ్రేడ్లు సైడైపోయారు. కమలనాథులు పోటీలోకి వచ్చారు. నిన్నటిదాకా ఓ లెక్క… ఇప్పుడో లెక్క అంటూ దీదీతో ఢీ అంటున్నారు. మూడోసారి విజయం కోసం మమతాబెనర్జీ, తొలి గెలుపు కోసం కమలం చేస్తున్న పోరాటంతో బెంగాల్‌ యుద్ధరంగాన్ని తలపిస్తోంది.

Bengal

బీజేపీ x తృణముల్ : –

గత లోక్‌సభ ఎన్నికల నుంచే బీజేపీ, తృణముల్‌లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ అవకాశం దొరికినా ఇరుపార్టీల కార్యకర్తలు దాడులకు దిగుతూ రాష్ట్రంలో రణరంగాన్నే సృష్టించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ వేడి మరింత పెరిగిపోయింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ బరిలో ప్రస్తుతం ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార తృణముల్‌, బీజేపీతో పాటు ఇటీవలే ఏర్పడ్డ కాంగ్రెస్‌, లెఫ్ట్‌ కూటమి మధ్య పోటీ దేశవ్యాప్త ఆసక్తిని రేపుతోంది.

vote share

ఓట్ షేర్ పెంచుకున్న బీజేపీ : –

ఇప్పటి వరకూ బెంగాల్ లో ఒక్కసారి కూడా అధికారం చేపట్టని కమలనాథులు గత లోక్‌సభ, స్థానిక ఎన్నికల్లో బాగానే పుంజుకున్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 42 లోక్ సభ స్థానాలకు గానూ 18 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఇదే ఊపు మీద దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో ఓట్ షేర్ ను బాగా పెంచుకున్న బీజేపీ తన శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. 2016లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ 10.16 శాతం ఓట్ షేర్ సాధించగా 2019 వచ్చేసరికి 40.64శాతం ఓట్ షేర్ సొంతం చేసుకుంది. ఆ ఊపుతో ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని కొట్టాలన్న గట్టి పట్టుదలతో ముందుకెళుతోంది. దీదీ రాజ్యాన్ని అంతం చేస్తామనే ధీమాతో ఉన్న కమలనాథులు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బెంగాల్‌ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తామని హామీలు గుమ్మరిస్తున్నారు.

support

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : –

బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ చాలాకాలం నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తృణముల్‌లో బలమైన సువేందు అధికారి లాంటి నేతలను తనవైపు తిప్పుకుంది. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తృణముల్‌ విలవిలలాడింది. ఎంతమంది నేతలు పోయినా పర్లేదని పైకి చెబుతున్నా ఆ ప్రభావం తృణముల్‌పై గట్టిగానే పడింది. బీజేపీ అగ్రనేత అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా పలుమార్లు బెంగాల్‌లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. రోడ్ షోల ద్వారా బెంగాలీలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని జనాల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బెంగాలీలు ఆగ్రహంతో ఉన్నారని, ఆమెను సాగనంపటం ఖాయమని అమిత్ షా ప్రకటనలు గుమ్మరించారు.