కేంద్రంపై మమత ఆగ్రహం..సాగు చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో తీర్మాణం

కేంద్రంపై మమత ఆగ్రహం..సాగు చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో తీర్మాణం

Bengal government కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్,కేరళ,రాజస్తాన్ సహా పలు రాష్ట్రాలు అసెంబ్లీల్లో తీర్మానాలు పాస్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్‌ కూడా ఈ జాబితాలోకి చేరింది. కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలన్న తీర్మానాన్ని గురువారం బెంగాల్ అసెంబ్లీలో మమత సర్కార్ ప్రవేశపెట్టింది.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ రెండురోజుల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన అసెంబ్లీ సభ్యులు, ప్రముఖ వ్యక్తులకు అసెంబ్లీ నివాళులర్పించే కార్యక్రమాన్ని స్పీకర్‌ బిమన్‌ బంద్యోపాధ్యాయ చేపట్టారు. అనంతరం..కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను “రైతులకు వ్యతిరేకం..కార్పొరేట్లకు అనుకూలం” అని పేర్కొంటూ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పార్థ చటర్జీ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మాణం సభలో ప్రవేశపెట్టగానే..దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత మనోజ్ టిగ్గా నేతృత్వంలో కాషాయపార్టీ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలిపేందుకు వెల్ లోకి వెళ్లారు. అనంతరం జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ఎంత మాత్రమూ ఆమోదించేది లేదని మమతా బెనర్జీ ఈ సందర్భంగా చెప్పారు. కేంద్రం వెంటనే చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ప్రతి ఆందోళనని టెర్రరిస్ట్ కార్యక్రమంగా బీజేపీ పేర్కొంటుందని అన్నారు. రైతులను దేశద్రోహులుగా ముద్రవేయడాన్ని తాము అంగీకరించబోమని..వారు దేశానికి ఆస్తులని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. రైతు చట్టాల రద్దుపై ప్రధాని వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. చట్టాలను ఉపసంహరించుకో లేకుంటే ప్రధాని పదవికి రాజీనామా చేయ్యి అంటూ ఆమో మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన హింసకు పోలీసులను మమత నిందించారు. వారు పరిస్థితులను గమనించి అదుపుచేయకుండా చేతులు దులుపుకున్నారన్నారు. ఢిల్లీ పోలీసులదే తప్పు అని ఆమె అన్నారు. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మమత అన్నారు.