బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన టాప్ బెంగాల్ పోలీస్ ఆఫీసర్ రాజీనామా

బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన టాప్ బెంగాల్ పోలీస్ ఆఫీసర్ రాజీనామా

Bengal Officer జనవరి-21న హుగ్లీ జిల్లాలో బీజేపీ నేత సువెందు రోడ్ షోలో ‘గోలీమారో..’ (దేశద్రోహులను కాల్చండి)అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆదేశించిన టాప్ బెంగాల్ పోలీస్ ఆఫీసర్.. హుమయూన్ కబీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కోల్ కతాకి సమీపంలోని చందానగర్ పోలీస్ కమిషనర్ గా ఉన్న హుమయూన్ కబీర్..వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. గత డిసెంబర్ లో హుమయూన్ ఐజీ క్యాడర్ కు ప్రమోట్ అయ్యారు. అయితే,ఇప్పుడు ఆయన రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిడి ఉందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

జనవరి 21న బీజేపీ నేత సువేందు అధికారి నిర్వహించిన ఓ ర్యాలీలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు దేశద్రోహులను కాల్చి చంపాలంటూ నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ సుమోటోగా కేసు నమోదు చేసి అదే రోజు రాత్రి హుమయూన్ కబిర్ ఆదేశాలతో ఆ ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే అదుపులోకి తీసుకున్న ముగ్గురినీ వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీకి చెందిన కార్యకర్తలు పోలీస్‌ కమిషనరేట్‌ ముందు ఆందోళనకు కూడా దిగిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసే ముందు రోజు కోల్ కతా వీధుల్లో అవే నినాదాలు చేసిన అధికార తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రం అరెస్ట్ చేయకుండా..కేవలం కక్ష్య సాధింపుతోనే తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారని విమర్శించారు. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. కాగా, గతేడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘గోలీమారో’ వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే.