Bengaluru : ట్రాఫిక్ లో చిక్కుకున్న డాక్టర్ .. ఆపరేషన్ ఉండటంతో కారు దిగి ఆస్పత్రికి పరుగు..

ట్రాఫిక్ లో చిక్కుకున్న డాక్టర్ కారు దిగి మూడు కిలోమీటర్లు పరుగు పెట్టారు. ఓ రోగికి ఆపరేషన్ చేయాల్సి ఉండటంతో కాదు దిగి పరుగు పరుగున ఆస్పత్రికి చేరుకుని రోగికి ఆపరేషన్ చేశారు..

Bengaluru : ట్రాఫిక్ లో చిక్కుకున్న డాక్టర్ .. ఆపరేషన్ ఉండటంతో కారు దిగి ఆస్పత్రికి పరుగు..

Bengaluru doctor stuck in traffic

Bengaluru : ఆయనో డాక్టర్. ఓ రోగికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. ముందుగానే ఆపరేషన్ డేట్ ఫిక్స్ కావటంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోవాలని ఇంటినుంచి ముందుగానే కారులో బయలుదేరారు. కానీ అనుకున్నట్లే అయ్యింది. ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేరు..అలాగని మరోదారిలో వెళ్లటానికి వీల్లేకుండా ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కుపోయారు. ఓ పక్క ఆపరేషన్ చేయాల్సి సమయం దగ్గరపడుతోంది. ఆస్పత్రికి వెళ్లే దారి లేదు.దీంతో కారు దిగి పరుగు పెట్టుకుంటూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి చేరుకున్నారు. అనుకున్న సమయానికే రోగికి ఆపరేషన్ చేయగలిగారు. కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో జరిగిన ఈ డాక్టర్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో డాక్టర్ గోవింద్ నందకుమార్ పేరొందిన సర్జన్. ఎప్పట్లాగే ఆస్పత్రికి బయలుదేరారు. ఉదయం 10 గంటలకు ఒక మహిళకు గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. కానీ దారిలో విపరీతంగా ట్రాఫిక్ ఉండటంతో ఆయన ముందుకు వెళ్లలేకపోయారు. 45 నిమిషాలు సిగ్నల్ లైట్ సూచనలో ఉంది. దీంతో ఏం చేయాలో ఆయనకు తోచలేదు. ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చేసి కారు దిగి..పరిగెత్తుకుంటూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న వెంటనే ఆపరేషన్‌కు రెడీ అయ్యి పేషెంట్ ప్రాణాలు కాపాడారు. శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో సదరు మహిళను అనుకున్న సమయానికే డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

తన కోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నాడన్న ఆలోచనతో ఇంకేం ఆలోచించకుండా ఆస్పత్రికి పరుగుతీశానని డాక్టర్ గోవింద్ నందకుమార్ తెలిపారు. తాను ఫిట్ నెస్ కోసం రోజు జాగింగ్ చేస్తానని ఫిట్ నెస్ ఉండటంతో మూడు కిలోమీటర్లు  పరుగు పెట్టి ఆస్పత్రికి చేరుకోగలిగానని తెలిపారు. కాగా.. ఎంతోమంది డాక్టర్ల నిర్లక్ష్యంతో ఎంతోమంది రోగులు ప్రాణాలు కోల్పోయారని వింటూంటాం. కానీ డాక్టర్ వృత్తి పట్ల ఉన్న అంకితభావం ఎంతోమంది ప్రాణాలు కాపాడుతోంది. ప్రాణాలు పోసేది దేవుడైతే..రోగులకు పునర్జన్మనిచ్చేది మాత్రం డాక్టర్లే. అందుకే డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తాం. డాక్టర్ గోవింద్ నందకుమార్ లాంటి డాక్టర్ల వల్లే డాక్టర్లకు అంతటి గౌరవం దక్కుతోంది అంటున్నారు నెటిజన్లు.