లండన్ లో నర్సింగ్ చదివే విద్యార్థి బెంగళూరులో కిడ్నాప్..ఏడు గంటల్లో రక్షించిన పోలీసులు

లండన్ లో నర్సింగ్ చదివే విద్యార్థి బెంగళూరులో కిడ్నాప్..ఏడు గంటల్లో రక్షించిన పోలీసులు

Police Arrest Four For Kidnap Rescue Student

police arrest four for kidnap rescue student : బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి కిడ్నాప్ అయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కిడ్నాపర్లు రూ. 2 కోట్ల డిమాండ్ చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించటంతో వెంటనే రంగంలోకి దిగి కేవలం ఏడు గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ కిడ్నాప్ ఘటన సుఖాంతం కావటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

బెంగళూరు నగరానికి చెందిన రబీజ్ అరాఫత్ అనే యువకుడు లండన్‌లో నర్సింగ్ ఎంఎస్ చదువుతున్నాడు. యూకేలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రబీజ్ లండన్ నుంచి బెంగళూరులోని తన ఇంటికి వచ్చాడు. అలా యూకేలో కరోనా పరిస్థితి చక్కబడేవరకూ వెళ్లటానికి లేదు. దీంతో రబీజ్ ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నాడు. ఈక్రమంలో ఓ రోజు మధ్యాహ్నం ఓ ఫోన్ రావడంతో రబీజ్ బయటకు వెళ్లాడు. అలా బయటకు వెళ్లిన రబీజ్ ను కారులో వచ్చిన కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు.

అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కిడ్నాపర్లు రబీజ్ తండ్రికి ఫోన్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోయినా..ఈ విషయం పోలీసులకు తెలిపినా మీ అబ్బాయిని చంపేస్తామని సినిమా స్లైల్లో వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ వేరే దారిలేక రబీజ్ తండ్రి కేజీహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు విడిపోయి సీసీకెమెరాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించాయి. అలా కిడ్నాప్ జరిగిన ఏడు గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించి వారి నుంచి రబీజ్ ను సురక్షితంగా రక్షించారు.

ఈ కిడ్నాప్ కేసులో నిందితులు అబ్దుల్ పహాద్, జబీవుల్లా, సయ్యద్ సల్మాన్, తౌహీద్‌లను అరెస్ట్ చేశారు. మరికొందరితో కలిసి ఈ కిడ్నాప్ ప్లాన్ వేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడించారు. తమకు అప్పులు ఉన్నాయని వాటిని తీర్చటానికే ఇలా కిడ్నాప్‌లు చేయాలని నిర్ణయించిన ముఠా.. నగరంలోని ధనవంతుల గురించి ఆరా తీసింది. ఆ తరువాత రెక్కీ చేసి కిడ్నాపులు చేయాలని పన్నాగం పన్నారు.

ఈ క్రమంలో రబీజ్ కుటుంబం కారును కొన్న విషయం విషయం తెలుసుకుని కిడ్నాపర్లు వీళ్లు ధనవంతులు వీళ్లింట్లో ఎవరినైనా కిడ్నాప్ చేస్తే డిమాండ్ చేసినంత డబ్బు ఇస్తారని కిడ్నాప్ ప్లాన్ వేసి రబీజ్ ను ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ కిడ్నాప్‌ సూత్రధారి అయిన అబ్దుల్ పహాద్‌పై గతంలోనూ కిడ్నాప్ కేసు నమోదైనట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.