హైదరాబాద్ నుంచి బెంగళూరు షిప్ట్ అయిన వరుణుడు : నానిపోయిన సాయిబాబా విగ్రహం, పవిత్ర గ్రంథాలు

  • Published By: madhu ,Published On : October 24, 2020 / 12:54 PM IST
హైదరాబాద్ నుంచి బెంగళూరు షిప్ట్ అయిన వరుణుడు : నానిపోయిన సాయిబాబా విగ్రహం, పవిత్ర గ్రంథాలు

Bengaluru receives heavy rains, several areas waterlogged : మొన్నటి వరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన వరుణుడు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టిస్తున్నాడు. రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూర్‌లోని బాబా దేవాలయంలోకి నీరు చేరుకుంది. బురద నీరంతా దేవాలయాన్ని ముంచెత్తింది. దీంతో ఆలయంలోని సాయిబాబా విగ్రహం, పవిత్ర గ్రంథాలు నానిపోయాయి.



గుడిలోని సామాగ్రంతా చెల్లాచెదురయ్యింది. దేవునికి పూజలు చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో అర్చకులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడికే కష్టాలొచ్చాయని వాపోతున్నారు.



కుండపోత వర్షాలకు రోడ్లన్నీచెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు…పలు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని జేసీ రోడ్డు ప్రాంతం పూర్తిగా నీట మునగడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో..ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.



భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఎర్పడింది. రోడ్లపై మోకాళ్ల లోతు వరదనీరు చేరగడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ధాటికి నగరంలో కొన్నిచోట్ల రహదారులు దెబ్బతినగా.. పలు భవనాలు బీటలు వారాయి. కోరమంగళ, బసవనగుడి, ఆర్ఆర్ నగర్‌లాంటి ప్రాంతాలను వరద ముంచెత్తింది.



హోసకెరహళ్లిలో మురుగు నీటి కాలువ ఉప్పొంగడంతో ఓ కారు అందులో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలాచోట్ల అపార్ట్‌మెంట్లలో, ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి.. రానున్న రెండు రోజులు పాటు కర్నాటకలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.