భారీ శబ్దాలతో బెంబేలెత్తిన బెంగుళూరు

  • Published By: murthy ,Published On : May 20, 2020 / 01:32 PM IST
భారీ శబ్దాలతో బెంబేలెత్తిన బెంగుళూరు

బెంగుళూరు మహానగరంలో బుధవారం మధ్యాహ్నం సంభవించిన భారీ శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో నగరంలోని వైట్‌ఫీల్డ్‌, ఎల‌క్ట్రానిక్స్ సిటీ, హెచ్ఏఎల్‌, హెచ్ఎస్ఆర్ లే ఔట్ ప్రాంతంలో వచ్చిన శ‌బ్దాలు చెవుల‌కు చిల్లులు ప‌డేలా చేశాయి. 

అత్యంత ర‌హ‌స్యంగా మారిన ఆ శ‌బ్దాల గురించి ఇంతవరకు ఎటువంటి వివ‌ర‌ణ తెలియలేదు. కాగా దీనిపై కొందరు నెటిజన్లు  సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. కొంద‌రు త‌మ ఇళ్ళలో కిటికీలు కూడా ఊగిన‌ట్లు ఆరోపించారు… కానీ ఆధారం లేని ఆ శ‌బ్దాల‌పై ప్ర‌భుత్వం కూడా స్పందించ‌లేదు. 

ఈ శబ్దాలు భూకంపానికి సంబంధించినవి కాదని కర్ణాటక రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్ ప్రకటించింది. రిక్టర్‌ స్కేలుపై ఎలాంటి ప్రకంపనలు రికార్డు కాలేదని కేఎస్‌ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. శబ్ధాలపై హెచ్‌ఏఎల్‌, ఐఏఎఫ్‌లను సంప్రదించగా ఆ శ‌బ్ధాల‌కు త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా తేల్చి చెప్పింది. 

కాగా.. ఫ్లైట్లు లేదా సూపర్ సోనిక్ శబ్దాలేమోనని నిర్ధారించుకోవడం కోసం బెంగళూరు పోలీసులు ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ రూంను సంప్రదించారు. వారి నుంచి సమాధానం రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా వింత‌గా మారిన  ఆ శ‌బ్దాల గురించి ఇంకా మిస్ట‌రీ వీడాల్సి ఉంది.