ప్రియుడి మోజులో.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య.. బెంగళూరులో వ్యక్తి దారుణ హత్య కేసులో సంచలన నిజాలు

ప్రియుడి మోజులో.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య.. బెంగళూరులో వ్యక్తి దారుణ హత్య కేసులో సంచలన నిజాలు

Wife Murder Husband : కర్నాటక రాజధాని బెంగళూరులో మార్చి 19న నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. 9మంది కలిసి నడి వయసున్న ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపడం సంచలనం రేపింది. ఈ హత్యాకాండ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఎవరా వ్యక్తి? ఎందుకంత కిరాతకంగా చంపారు? అసలు వివాదం ఏంటి? అనే ప్రశ్నలు మిస్టరీగా మారాయి. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. రోజుల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని చేధించారు. ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. ఆ హత్యకు కారణం చనిపోయిన వ్యక్తి భార్య వివాహేతర సంబంధమే అని తెలిసి పోలీసులు విస్తుపోయారు. భార్యే అసలు సూత్రధారి అని తెలిసి షాక్ అయ్యారు. ఆమె, ఆమె ప్రియుడు కలిసి 9మంది సుపారి కిల్లర్లను మాట్లాడి పక్కాగా హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ 9మంది సుపారి కిల్లర్లలో ఐదుగురు టీనేజర్లే కావడం బాధాకరమైన విషయం.

ఆమె పేరు తస్లీమ్ భాను(29)‌. అతడి పేరు మహ్మద్ షఫీ(35). షఫీ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొన్నేళ్ల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. సంసారం హ్యాపీగా సాగిపోతోంది. ఈ సమయంలో ఓ పెళ్లి వేడుక తస్లీమ్ జీవితాన్ని మార్చేసింది. ఆ పెళ్లిలో అఫ్సర్ ఖాన్ (41)అనే వ్యక్తి తస్లీమ్ కు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ఒకరికొకరు టచ్‌లో ఉండేంత వరకూ వెళ్లింది. తస్లీమ్ తన భర్తకి తెలియకుండా అఫ్సర్‌తో తరుచూ ఫోన్‌లో మాట్లాడేది.

వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అఫ్సర్‌ను దూరంగా పెట్టలేకపోయిన తస్లీమ్.. పెద్ద స్కెచ్ వేసింది. ప్రియుడిని రియల్‌ ఎస్టేట్ బ్రోకర్‌గా తన భర్తకు పరిచయం చేసింది. అంతేకాదు భర్తను నమ్మించి రూ.75 లక్షల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించింది. అఫ్సర్‌కు భర్త షఫీ నుంచి రూ.5 లక్షలు కమీషన్ కూడా ఇప్పించింది. వ్యాపారం వంకతో భర్తను నమ్మించి.. తస్లీమ్, అఫ్సర్ తరుచూ కలిసేవారు. అలా కొన్నాళ్లు దొంగచాటుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అయితే.. తమ బంధానికి షఫీ అడ్డుగా ఉన్నాడని భావించిన అఫ్సర్, తస్లీమ్.. అతనిని చంపేందుకు ప్లాన్ చేశారు. తొలుత ఇద్దరూ కలిసి షఫీపై చేతబడి చేయించారు. ఫలితం లేకపోవడంతో సుపారి కిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

షఫీ ఇచ్చిన కమీషన్ డబ్బుల నుంచే తన ఇద్దరి స్నేహితులైన సుపారి కిల్లర్లకు చెరో రెండు లక్షలిచ్చిన అఫ్సర్… షఫీ హత్యకు పక్కా ప్లాన్ చేశాడు. మార్చి 19న వ్యాపారం గురించి మాట్లాడాలని షఫీని టింబర్ యార్డుకి పిలిచాడు అఫ్సర్. అతడు చెప్పిన ప్రాంతానికి షఫీ చేరుకున్న వెంటనే అప్పటికే మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న సుపారీ కిల్లర్లు అతడిపై విరుచుకుపడ్డారు. అతి కిరాతకంగా షఫీని హత్య చేసి పరారయ్యారు. షఫీ మృతిపై అతడి తండ్రి ఆరిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేశారు. అసలు సూత్రధారి భార్యే అని తెలిసి కంగుతిన్నారు.

ఈ హత్య కేసులో మొత్తం 9 మందికి సంబంధముందని పోలీసులు తేల్చారు. వారిలో ఐదుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. తస్లీమ్ భాను, అఫ్షర్ ఖాన్, పాషా(26), సయ్యద్ వాసిమ్(26), వెంకటేష్(19), భరత్(18), చేతన్(19), ఇబ్రహిం(19), ఓ మైనర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిన తస్లీమ్ తీరు అందరిని నిర్ఘాంతపరిచింది.