బెంగళూరు మహిళకి నెల తర్వాత రెండోసారి కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 6, 2020 / 07:47 PM IST
బెంగళూరు మహిళకి నెల తర్వాత రెండోసారి కరోనా పాజిటివ్

బెంగళూరులో 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని డాక్టర్లు చెప్పారు. మొదట జులై మొదటి వారంలో కరోనా లక్షణాలతో ఆ మహిళ ఆస్పత్రిలో చేరారు. జులై-6న ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. చికిత్స చేసిన అనంతరం జులై-24న మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్‌ రిపోర్టు వచ్చింది.

జులై- 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. నెల రోజుల తర్వాత ఆగస్టు చివరిలో మళ్లీ అదే లక్షణాలతో ఆస్పత్రికి వస్తే.. పరీక్షలు నిర్వహించగా . పాజిటివ్ ‌గా నిర్ధారణ అయ్యిందని బెంగళూరులోని ఫోర్టిస్‌ హాస్పిటల్ డాక్టర్ ప్రతీక్‌ పాటిల్‌ తెలిపారు.

తాజా కేసులో రెండోసారి మహిళకు యాంటీబాడిస్‌ పరీక్షలో నెగటివ్‌ తేలిందని డాక్టర్లు తెలిపారు. దీనిని బట్టి వైరస్‌ సంక్రమించిన తర్వాత ఆమెకు వ్యాధి నిరోధక శక్తి పెరగకపోవడమైనా ఉండాలి,లేదంటే అభివృద్ధి చెందిన యాంటీబాడీస్‌ నశించిపోయి ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా సోకిన వారందరికీ ఇది రెండోసారి సంక్రమిస్తుందని చెప్పలేమన్నారు.

కాగా,కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన కొందరికి వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైన కొన్ని వారాల తర్వాత తిరిగి ‘పాజిటివ్‌’గా తేలుతున్న ఉదంతాలు ఇటీవల వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.

అయితే, కరోనా బారిన పడిన వారికి రెండోసారి మహమ్మారి సోకుతుందా అనే ప్రశ్నకు విభిన్న సమాధానాలొస్తున్నాయి. కొందరు రెండోసారి కూడా వస్తుందంటే.. మరికొందరు ఆ అవకాశం చాలా తక్కువ అంటున్నారు. కానీ, ఈ మహమ్మారి రెండోసారి కూడా సోకిన ఉదంతాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుర్తించినట్లు హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు ప్రకటించడం, నెదర్లాండ్స్, బెల్జియంలోనూ ఇలాంటి రెండు కేసులు వెలుగు చూసినట్లు వార్తలు రావడంతో ఇది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.