న్యూ ఇయర్‌లో కరోనాతో జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం లేఖలు.. నిర్ణయం మీదే..

న్యూ ఇయర్‌లో కరోనాతో జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం లేఖలు.. నిర్ణయం మీదే..

కరోనాకు వ్యాక్సిన్ వస్తున్న వేళ జనాలు బయట తిరగడం ఎక్కువైందని, ఈ సమయంలోనే ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచనలు చేసింది. కరోనా కష్టకాలంలో ఎన్నో రోజులు ఇళ్లలోనే గడిపిన ప్రజలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ రాగా.. వేడుకలకు సిద్ధం అవుతున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రాలకు లేఖలు రాశారు.

కరోనా తగ్గిపోయిందని ప్రజలు భావిస్తున్నట్లుగా పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని, అయితే కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని, ప్రజలు ఇంకా కొంతకాలం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకోసం రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని కేంద్రం సూచించింది. దీనిపై తుది నిర్ణయం మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అని స్పష్టం చేసింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాలని కఠినంగా సూచించింది కేంద్రం.

దేశంలో ఎప్రిల్, మే నుంచి అక్టోబర్, నవంబర్ వరకు పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ, క్రియాశీల కోవిడ్ కేసులు దేశంలో ఈ నెలలో తగ్గుతూ వస్తున్నాయి. కానీ కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రపంచంలో వచ్చినట్లుగా వార్తలు వస్తుండడంతో.. కొన్ని అత్యవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తుంది. దేశంలో కఠినమైన నిఘా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకల విషయంలో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోగా.. ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా, ఒకేచోట చేరకుండా నిరోధించాలని కేంద్రం పేర్కొంది. కరోనా మహమ్మారి విస్తరించే అవకాశం ఎక్కువగా ఉండడంతో కేంద్రం హెచ్చరికలు జారీ చేయగా.. అంతర్రాష్ట్ర రాకపోకల విషయంలో మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించవద్దని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.