Punjab CM: భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ.2 కోట్లు ఖర్చు: గోధుమ పంట నాశనం

పార్టీ నేతల వాహనాలతో పాటు, వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం భగత్ సింగ్ మెమోరియల్ కు ఆనుకుని ఉన్న 45 ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి అద్దెకు తీసుకున్నారు

Punjab CM: భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ.2 కోట్లు ఖర్చు: గోధుమ పంట నాశనం

Aap

Punjab CM: ఇటీవల జరిగిన పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఎటువంటి పొత్తులు లేకుండానే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఈమేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్.. తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మంగళవారం నాడు పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పంజాబ్ లోని నవాన్‌షహర్ జిల్లా ఖట్కర్‌కలన్ గ్రామంలో ఉన్న “షాహీద్ భగత్ సింగ్ మెమోరియల్ గ్రౌండ్” సమీపంలో.. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేశారు. పంజాబ్ గవర్నర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు..రాజకీయ నేతలు, వీఐపీలు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.

Also read: Pawan Kalyan: ఏపీ రాజధాని అమరావతే..!

భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి వచ్చే వేలాది వాహనాలను దృష్టిలో పెట్టుకుని.. పంజాబ్ రాష్ట్ర పోలీసులు, నవాన్‌షహర్ జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. పార్టీ నేతల వాహనాలతో పాటు, వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం భగత్ సింగ్ మెమోరియల్ కు ఆనుకుని ఉన్న 45 ఎకరాల పంట పొలాలను అధికారులు రైతుల నుంచి అద్దెకు తీసుకున్నారు. ప్రమాణ స్వీకార వేదిక వద్ద నేతల కోసం 40 వేల కుర్చీలు ఏర్పాటు చేయగా, లక్ష మంది కూర్చొని భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ 25 వేల వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పటికే ఆ పొలాల్లో.. చేతికంద వచ్చిన గోధుమ పంట ఉంది. దీంతో పొలాలను పార్కింగ్ కోసం ఇస్తే తాము తీవ్రంగా నష్టపోతామంటూ రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై అధికార యంత్రాంగం స్పందిస్తూ పంట నష్టపరిహారాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే కనీసం ఎకరాకు రూ.46 వేలు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Also read: CM YS Jagan: గూడెం ఘటనపై టీడీపీ ఆరోపణల మీద జగన్ ఫైర్

పంజాబ్‌లో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం తొలిసారిగా గవర్నర్ హౌస్ వెలుపల బహిరంగంగా జరుగుతన్నందున అందుకు అయ్యే ఖర్చును ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈమేరకు ఆర్థిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ రూ.2 కోట్లు నిధులను విడుదల చేశారు. ఖట్కర్‌కలన్ గ్రామంలోని షాహీద్ భగత్ సింగ్ మెమోరియల్ సమీపంలోని ప్రైవేట్ స్కూల్ గ్రౌండ్‌లో నాలుగు హెలిప్యాడ్‌లను నిర్మించారు. ఈ కార్యక్రమానికి వచ్చే పంజాబ్ గవర్నర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర వీవీఐపీల హెలికాప్టర్లు ఈ హెలిప్యాడ్‌ల వద్ద దిగుతాయి. పాఠశాల మైదానం నుంచి ప్రజలు రోడ్డు మార్గంలో వేదిక వద్దకు చేరుకుంటారు.

Also read: The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు: రాజకీయ దుమారం

అయితే ప్రమాణస్వీకారానికి కొత్త ప్రభుత్వం చేస్తున్న అసామాన్య ఖర్చుపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజభవన్ లో నిరాడంభరంగా జరిగిన కార్యక్రమాలకు ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు చేయడం అవసరమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ సామాన్యుడి ఓటుతో అధికారంలోకి వచ్చి.. సామాన్యుల శక్తికి మించి ఖర్చు ఎలా చేస్తారని.. ఇదంతా ప్రజల సొమ్ము కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ప్రమాణస్వీకారం ఏదైనా ఖాళీ మైదానంలో పెట్టుకోకుండా ఇలా పచ్చని పంట పొలాలను నాశనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Also read: Minister KTR : ప్రిపరేషన్ పై శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచన