Bharat Bandh : రేపు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల ఉద్యమం మరింత ఉధృతం

రైతులు, కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.

Bharat Bandh : రేపు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల ఉద్యమం మరింత ఉధృతం

Bharat Bandh By Farmers

Bharat Bandh : రైతులు, కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న రైతు సంఘాలు భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చాయి. అదే సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్‌కు కార్మిక సంఘాలు సైతం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో పలు ధపాలు చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి మార్చి 26న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.

అలాగే హోలీ పండుగ జరుపుకునే మార్చి 28న వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేసి రైతు సంఘాలు నిరసన తెలపనున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో గతేడాది(2020) డిసెంబర్‌లోనూ రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజా బంద్‌తో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి.

మార్చి 26న ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బంద్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. ఇప్పటికే బంద్‌కు అన్ని ట్రేడ్, టాన్స్‌పోర్ట్ యూనియన్లు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

మార్చి 26తో రైతుల ఆందోళనలు నాలుగు నెలలకు చేరుతుండటంతో రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే కేంద్రం పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ అవేవీ సఫలం కాని సంగతి తెలిసిందే. ఏడాదిన్నర పాటు తాత్కాలికంగా ఆ చట్టాలను పక్కన పెడుతామని కేంద్రం ప్రతిపాదించినప్పటికీ రైతులు అందుకు అంగీకరించ లేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక ఎజెండాతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని సింగు, టిక్రి, ఘాజీపూర్ ప్రాంతాల్లో నాలుగు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు స్లీల్ ప్లాంట్ పరిరక్షణకు కార్మికులు సైతం ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న పోరాటాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. భారత్ బంద్ ను సక్సెస్ చేసిన తర్వాత సమ్మెకు సిద్ధమవ్వాలని కార్మిక సంఘాలు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనిపై యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చాయి కార్మిక సంఘాలు. దీంతో ఏ క్షణమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరెన్ మోగే అవకాశం ఉంది.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మారుమోగుతూనే ఉంది. కేవలం విశాఖలోనే కాక ఏపీ వ్యాప్తంగా ఉక్కు ఉద్యమం ఎగసి పడుతోంది. 40 రోజులకు పైగా కార్మిక సంఘాలు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. ఓ వైపు రిలే నిరహార దీక్షలు చేస్తూనే.. వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నాయి. శుక్రవారం భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన కార్మిక సంఘాలు.. ఆ వెంటనే సమ్మె సైరన్ మోగించాలని నిర్ణయించాయి. భారత్ బంద్ కు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు సహకరించాలని.. బంద్ ను విజయవంతం చేయాలని అటు రైతులు, ఇటు కార్మిక సంఘాలు కోరాయి.