కరోనా వ్యాక్సిన్ : ముక్కు ద్వారా చుక్కల మందు, భారత్ బయోటెక్ మరో ముందడుగు

కరోనా వ్యాక్సిన్ : ముక్కు ద్వారా చుక్కల మందు, భారత్ బయోటెక్ మరో ముందడుగు

Nasal Coronavirus Vaccine : కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ముక్కు ద్వారా వేసే డ్రాప్స్ మందును తీసుకొస్తోంది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థకి దరఖాస్తు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని ఇవ్వాలని కోరింది. భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ కరోనా టీకాకు ఇప్పటికే అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రా జెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ రెండు టీకాలు సిరంజి ద్వారా మనిషి శరీరంలోకి పంపిస్తారు. ఇవి రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా..టీకా ముక్కు ద్వారా తీసుకోగలిగే వీలుంటుందని, ఒక్క డోసు తీసుకుంటే చాలని వెల్లడిస్తోంది. ఈ ముక్కులో వేసే కరోనా వ్యాక్సిన్ కు BBV 154 అని పేరు పెట్టింది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫిబ్రవరి – మార్చి నెలలో మొదటి దశ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL)తో కలిసి పరిశోధన సహకారం చేయనున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR-NIV) వద్ద వేరు చేసిన కరోనా వైరస్ జాతిని BBILకు బదిలీ చేసినట్లు ICMR వెల్లడించింది. టీకా తయారీ, అభివృద్ధి, జంతువులు, మనుషులపై ప్రయోగాలు చేపట్టడం, విశ్లేషించడంలో బీబీఐఎల్‌–ఎన్‌ఐవీ పరస్పరం సహకరించుకుంటాయి’ అని ఐసీఎంఆర్‌ తెలిపింది.