భారత్ బయోటెక్ వ్యాక్సిన్” కోవాగ్జిన్” బ్యాకప్ మాత్రమే : ఎయిమ్స్ చీఫ్

భారత్ బయోటెక్ వ్యాక్సిన్” కోవాగ్జిన్” బ్యాకప్ మాత్రమే : ఎయిమ్స్ చీఫ్

AIIMS Chief భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్ర‌స్తుతానికి ఓ బ్యాక‌ప్‌ లాగానే ఉంటుంద‌ని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ చీఫ్ డాక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా అన్నారు. డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(DCGI)ఆదివారం కొవాగ్జిన్‌తోపాటు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ త‌యారు చేసిన కొవిషీల్డ్‌కు కూడా ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

రానున్న రోజుల్లో సీర‌మ్ త‌యారు చేసిన కొవిషీల్డ్ ప్ర‌ధాన వ్యాక్సిన్‌గా ఉండ‌బోతోంద‌ని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో ర‌ణ్‌దీప్ గులేరియా అన్నారు. భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ ఓ బ్యాక‌ప్‌గా ఉంటుంద‌ని, ఒక‌వేళ యూకే క‌రోనా వైర‌స్ వేరియంట్ తీవ్ర రూపం దాలిస్తే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కొవాగ్జిన్‌ను వాడుతార‌ని ఆయ‌న చెప్పారు. ఆ లోపు భార‌త్ బ‌యోటెక్ త‌మ మూడో ద‌శ ప్ర‌యోగాల‌ను పూర్తి చేసి త‌మ వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌త‌, భ‌ద్ర‌త‌పై మ‌రింత డేటాను చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని ర‌ణ్‌దీప్ అభిప్రాయ‌ప‌డ్డారు. తొలి కొన్ని వారాల పాటు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌నే వేస్తార‌ని, సీర‌మ్ ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉన్న‌ద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

మరోవైపు, కొవాగ్జిన్ ఇంకా మూడో ద‌శ ప్ర‌యోగాల్లో ఉన్న‌ప్పుడే అనుమ‌తి ఎలా ఇచ్చారంటూ ప‌లువురు విపక్ష నేతలు ప్ర‌శ్నిస్తున్నారు. “కోవాక్సిన్‌కు ఇంకా 3 వ దశ ట్రయల్స్ ముగియలేదు. ముందుగానే ఆమోదం తెలపడం ప్రమాదకరమైనది కావచ్చు. కేంద్రఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ దీనిపై వివరణ ఇవ్వాలి. పూర్తిగా ట్రయల్స్ ముగిసేవరకు దీని వాడకూడదు. ఈ సమయంలో భారత్..ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను వాడొచ్చు అని మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ట్వీట్ చేశారు.

కాగా,భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో “కోవాక్సిన్” క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశ మరియు రెండవ దశ ట్రయల్స్ పూర్తి అవగా,మూడో దశ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు. మూడవ దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మూడోదశ ట్రయల్స్ పాల్గొంటున్న 25,800 మందిలో 22,500 మందికి టీకాలు వేశారు. అయితే, కోవాగ్జిన్ కు “పరిమితం” ఆమోదం ఇస్తున్నట్లు ప్రకటిస్తూ…ట్రయల్స్ ఫలితాలు “సురక్షితమైనవి మరియు బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను అందిస్తున్నాయి” అని డ్రగ్ కంట్రోలర్ జనరల్ విజి సోమాని తెలిపారు.

ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ…కోవాగ్జిన్ “భద్రత మరియు రోగనిరోధక శక్తి” పై మొత్తం డేటాను సమీక్షించిందని మరియు “ప్రజా ప్రయోజనంలో అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన ఉపయోగం” కు అనుమతి ఇచ్చిందని ఆయన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.