భారత్ బయోటెక్ కోవాగ్జిన్ 3వ దశ ప్రయోగాలు ప్రారంభించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్

  • Published By: murthy ,Published On : December 3, 2020 / 12:01 AM IST
భారత్ బయోటెక్ కోవాగ్జిన్ 3వ దశ ప్రయోగాలు ప్రారంభించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్

COVID-19 Vaccine ‘Covaxin’ Begins Phase-3 Clinical Trial : దేశీయంగా తయారు చేయబడిన కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పశ్చిమబెంగాల్ లో బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలను ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ కోల్‌కతాలోని ఐసిఎంఆర్-ఎన్‌ఐసిఇడిలో ప్రారంభించారు.

కరోనా నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం దేశీయంగా కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ…..దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహిస్తున్నామని….. అందులో ఒకటైన ఎన్‌ఐసీఈడీలో ప్రారంభిస్తున్న ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


మన దేశం సమర్థవంతంగా కరోనా వైరస్‌ను కట్టడిచేయటంలో కృషిచేసిందని గవర్నర్ అన్నారు. ఉచిత ఆరోగ్యసేవలను అందించే ఆయుష్మాన్‌భారత్‌ పథకం చాలా మందికి సహాయాన్ని అందించిందన్నారు. కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బెంగాల్‌లో ఈ పథకం ఇప్పటి వరకూ అమలు కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.


కొవాగ్జిన్‌ తొలి రెండు దశల్లో జరిగిన క్లినికల్‌ ప్రయోగాలు విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో మూడో దశ ప్రయోగాలకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.