“చక్కా జామ్” కోసం రైతులు,పోలీసుల ముమ్మర ఏర్పాట్లు

“చక్కా జామ్” కోసం రైతులు,పోలీసుల ముమ్మర ఏర్పాట్లు

Bharatiya Kisan రిపబ్లిక్ డే రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో రైతు సంఘాలు శనివారం(ఫిబ్రవరి-6,2021)చేపట్టనున్న’చక్కా జామ్’పై అందరి దృష్టి నెలకొంది.’చక్కా జామ్​’ పేరుతో నిర్వహించే దేశవ్యాప్త రహదారుల దిగ్బంధం కార్యక్రమం కోసం రైతులు సిద్ధమవుతుండగా.. పరిస్థితులు అదుపుతప్పకుండా చూసేందుకు భద్రతా దళాలు ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశాయి.

గాజీపుర్​ సరిహద్దుల్లో రైతు శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను మరింత పటిష్ఠపరిచేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కొన్ని మార్పులు చేయిస్తున్నారు. జవాన్లపై ఎలాంటి దాడులు జరగకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సీఆర్​పీఎఫ్​ అధినాయకత్వం సూచించింది. బలగాలు ప్రయాణించే బస్సులకు యుద్ధప్రాతిపదికన ముళ్ల కంచెలు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది .

ఇక, రహదారులు దిగ్బంధించే కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ మీడియా ఇంఛార్జి ధర్మేంద్ర మాలిక్ చెప్పారు.ఢిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దుల్లోని గాజీపూర్​ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రైతు శిబిరాలకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకుంటున్నారని తెలిపారు.

మరోవైపు చక్కా జామ్ కి తాము మద్దతు ఇవ్వట్లేదని ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్(BKS)సృష్టం చేసింది. దేశవ్యాప్త రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో తాము పాల్గొనట్లేదని తెలిపింది. చట్టాలను కనుక రద్దు చేయకుంటే మోడీ సర్కార్ ని గద్దె దింపుతాం అంటూ భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేష్ టికాయత్ బుధవారం కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో బీకేఎస్ నుంచి ఈ ప్రకటన రావడం కీలకంగా మారింది. తాము భారత్ బంద్ కి మద్దతివ్వట్లేదని..అలాగని మూడు వ్యవసాయ చట్టాలను కూడా ఆమోదించట్లేదని..చట్లాల్లో కొన్ని మార్పులు కోరుకుంటున్నట్లు బీకేఎస్ పేర్కొంది.