ISRO Espionage Case : ఇస్రో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది.

ISRO Espionage Case : ఇస్రో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం!

Isro2

ISRO Espionage Case భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం కేరళ హైకోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిలు దరఖాస్తుపై విచారణ సందర్భంగా సీబీఐ ఈ అనుమానం వ్యక్తం చేసింది. 1994లో సీబీఐ నమోదు చేసిన గూఢచర్యం కేసులో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను, ఇతరులను ఇరికించేందుకు శ్రీకుమార్ కుట్ర పన్నినట్లు సీబీఐ ఆరోపించింది.

ఇస్రో గూఢచర్యానికి సంబందించి పలు డాక్యుమెంట్లను తారుమారు చేసేందుకు మొత్తం 18 మంది కుట్ర పన్నారని, వీరిలో కేరళ మాజీ పోలీసు అధికారులు, ఐబీ అధికారులు కూడా ఉన్నారని పేర్కొంటూ సీబీఐ తన చార్జిషీట్ ను దాఖలు చేసింది. ముందస్తు బెయిల్ కోసం శ్రీకూర్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను తిరస్కరించాలని సీబీఐ అధికారులు కోర్టుని కోరారు. అయితే ఆయనను సోమవారం వరకు అరెస్టు చేయరాదని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో ఇద్దరు మాజీ పోలీసు అధికారులు విజయన్, థంపిలకు కోర్టు రెండు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. నిజానికి వీరిద్దరిపైనా వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని సీబీఐ తెలిపింది.

కాగా, ఓ ఇస్రో ఉన్నతాధికారి, ఓ వ్యాపారవేత్త, ఇద్దరు మాల్దీవియన్ మహిళలతో కలిసి నంబి నారాయణన్ గూఢచర్యానికి పాల్పడినట్లు 1994లో సీబీఐ కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేసింది. నంబి నారాయణన్‌ 1995లో విడుదలయ్యారు. అనంతరం ఆయన తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ, అవిశ్రాంతంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరకు ఆయనను ఇన్నాళ్లుగా వేధిస్తూ వచ్చారని,మానసికంగా ఎంతో క్షోభ పెట్టారని అంటూ.. ఆయనకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో తీర్పునిచ్చింది. ఈ కేసులో నంబి నారయణన్ బాధితుడని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా నారాయణన్ కి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించింది. వీటికి అదనంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం రూ.1.30 కోట్లు నష్టపరిహారం చెల్లించింది.