ఫాస్టాగ్ విషయంలో వాహనదారులకు బిగ్ రిలీఫ్

ఫాస్టాగ్ విషయంలో వాహనదారులకు బిగ్ రిలీఫ్

big relief for vehicle owners in fastag: ఫాస్టాగ్ నిబంధన విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ‘ఫాస్టాగ్’ అకౌంట్/వ్యాలెట్ లో కనీస నిల్వ(మినిమమ్ అమౌంట్) ఉండాలన్న నిబంధనను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక సవరణలు చేశామంది. దీనికి సంబంధించిన ఆదేశాలను బుధవారం(ఫిబ్రవరి 10,2021) జారీ చేసింది.

త్వరలోనే దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ‘ఫాస్టాగ్’ నిబంధన అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కాగా, ఫాస్టాగ్ ఖాతాలో కనీస నిల్వ ఉంటేనే టోల్ ప్లాజాల నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో అక్కడ అనవసర రద్దీ ఏర్పడుతోంది. దీనిని నివారించే ఉద్దేశంతో కనీస నిల్వ నిబంధనను ఎత్తివేసింది కేంద్రం. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఫాస్టాగ్‌లో కనీస మొత్తం లేకున్నా అనుమతిస్తారు. అయితే, ఆ మొత్తాన్ని ఫాస్టాగ్ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు. వాహనదారులు ఆ తర్వాత చెల్లించే టోల్ ఫీజులో దీనిని కూడా కలుపుతారు.

ఫిబ్రవరి 15 నుంచి టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాహనదారులంతా ఫాస్టాగ్ ను తీసుకోవాల్సిందేననీ, లేదంటే ప్రయాణం ముందుకు సాగబోదని స్పష్టం చేసింది. దీంతో మెజారిటీ వాహనదారులు(2.54 కోట్ల మందికి పైగా) ఫాస్టాగ్ ను పొందారు. ఇప్పటికే టోల్ గేట్ల దగ్గర దాదాపు 80శాతం చెల్లింపులు ఫాస్టాగ్ తోనే జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15 నాటికి దీనిని వంద శాతానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రోజూ రూ.89 కోట్లు ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.