వలస కూలీల కోసం పెద్ద పథకం…116 జిల్లాలను గుర్తించిన కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : June 8, 2020 / 02:00 PM IST
వలస కూలీల కోసం పెద్ద పథకం…116 జిల్లాలను గుర్తించిన కేంద్రం

కోవిడ్-19 నేపథ్యంలో మార్చి నెలలో అకస్మాత్తుగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వలసకూలీలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ విధించడంతో నగరాల్లో ఉన్న వలసకూలీలు రాత్రికి రాత్రే ఉపాధి కోల్పోయి గ్రామాల బాటపట్టారు. వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి స్వస్థలాకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం తెలిసిందే.

వలసకూలీల విషయంలో కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వలసకూలీల ఇష్యూని హ్యాండిల్ చేయడంలో కేంద్రం విఫలమైందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సమయంలో వలసకూలీల కోసం మోడీ సర్కార్ ఓ పెద్ద స్కీమ్ ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. వలసకూలీలకు ప్రస్తుతం ఉన్నచోటునే ఉపాధి కల్పించాలని నిర్ణయించిన మోడీ సర్కార్..ఎక్కువగా వలసకూలీలు ఉన్న 116 జిల్లాలను గుర్తించింది. ఆ జిల్లాల్లో ఉన్నవారికి ఉపాధి కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.

అయితే ఈ లిస్ట్ లో బీహర్ నుంచే 32 జిల్లాలు ఉండటం విశేషం. తర్వాత 31 జిల్లాలతో యూపీ, మధ్యప్రదేశ్ 24, రాజస్థాన్ 22, ఒడిశా నుంచి 4, జార్ఖండ్ నుంచి 3 జిల్లాలు ఉన్నాయి. ఇకడున్న వారికి పునరావాసం కల్పించి, ఉపాధి అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. సోషల్ వెల్పేర్ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది.

116 జిల్లాల్లో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(MNREGA),ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ క్యాంపెయిన్ కింద మరియు అదేవిధంగా ఆహార భద్రత పథకం, పీఎం ఆవాస్ యోజన, స్కిల్ ఇండియా,జన్ థన్ యోజన,కిసాన్ కళ్యాణ్ యోజన వంటి సంక్షేమ పథకాల ద్వారా వలసకూలీలకు ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయంలో అన్ని మంత్రిత్వశాఖల నుంచి ప్రధానమంత్రి కార్యాలయం సమాచారాన్ని అడిగినట్లు తెలుస్తోంది. గత నెల రోజుల నుంచి వలసవచ్చిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందుకోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో కమిటీ కూడా వేసింది. మరో రెండు వారాల్లో కమిటీ నివేదిక అందజేయనుంది.  రిపోర్ట్ ఆధారంగా వలసకూలీల ఉపాధి గురించి కేంద్రం నిర్ణయం తీసుకోబోతోంది.