కేరళలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..పీసీ చాకో రాజీనామా

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

కేరళలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..పీసీ చాకో రాజీనామా

PC Chacko resigns కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీలో వర్గ విభేదాలు, నాయకత్వ లేమి కొరవడిందని, పార్టీలో కొనసాగలేని పరిస్థితి వల్లే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు ఆయన తెలిపారు.

కేరళలో కాంగ్రెస్ రోజురోజుకూ కనుమరుగవుతోందని, ఇందుకు నిరసనగానే తాను పార్టీకి రాజీనామా చేశానని పీసీ చాకో చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం అనేది మిగలలేదని ఆయన వాపోయారు. అభ్యర్థుల జాబితాపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో చర్చించలేదని తెలిపారు. కాంగ్రెస్ మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని, కానీ ఇక్క‌డ కాంగ్రెస్ నేత‌లు రెండు గ్రూపులుగా విడిపోయిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఇదే అంశాన్ని అధిష్టానంతో చ‌ర్చించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. కానీ ఆ రెండు గ్రూపులు ఇస్తున్న ప్ర‌తిపాద‌న‌ల‌ను హైక‌మాండ్ అంగీక‌రిస్తోంద‌ని, దీని వ‌ల్ల కేర‌ళ‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ త‌ప్ప‌ద‌ని ఆయ‌న అన్నారు. గ‌త ఏడాది నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షులు లేర‌ని, ఇలాంటి సంద‌ర్భంలో కేర‌ళ‌లో కాంగ్రెస్ నేత‌గా కొన‌సాగ‌డం క‌ష్ట‌మ‌ని, ఏదో గ్రూపుకు చెందితేనే ఇక్క‌డ మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌మ‌ని, నాయ‌క‌త్వం యాక్టివ్‌గా లేద‌ని చాకో ఆరోపించారు. అయితే ఆయన మరేదైనా పార్టీలో చేరతారా? లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాను తన రాజీనామాను సోనియాగాంధీకి పంపినట్టు మాత్రమే ఆయన తెలిపారు.

కేరళలో స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన పీసీ చాకో.. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మొదటిసారి పిరవం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈకే నాయనర్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మూడు సార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన 2జీ స్కాంలో ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో చిలకుడి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.