Budget 2021: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా సామాన్యునిపై భారం పడదు..

Budget 2021: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా సామాన్యునిపై భారం పడదు..

agriculture cess on petrol and diesel: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్(Union Budget 2021). అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు సభలో నిరసనకు దిగాయి. స్పీకర్‌ ఓం బిర్లా వారించినప్పటికీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. వారి నినాదాల నడుమే నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా మూడోసారి. కాగా, దేశ చరిత్రలో తొలిసారిగా పేపర్ లెస్(డిజిటల్) బడ్జెట్ ను సమర్పించారు. ట్యాబ్‌లో చూసి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.

బడ్జెట్ లో కామన్ మ్యాన్(సామాన్యుడికి) ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్రం.. భారీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. కామన్ మ్యాన్ కి పెట్రో వాత పెట్టింది. పెట్రోల్, డీజిల్ పై వ్యవసాయ సెస్(సుంకం) విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. లీటర్ పెట్రోల్ పై రూ.2.50, డీజిల్ పై రూ.4 వ్యవసాయ సెస్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఈ కారణంగా ఇప్పటికే సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు మరింత పెరగనున్నాయి.

డీజిల్, పెట్రోల్ ట్యాక్సుల విషయంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం విధించారు. ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు వాటా, సెస్సు మొత్తం కేంద్రం ఖజనాకే చేరనుంది. మార్పులు చేర్పులతో రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి పడనుంది. కాగా, అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ తో లీటర్‌ పెట్రోలు ధర సెంచరీ దాటడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరిన సంగతి తెలిసిందే. అయితే నిర్మలా సితారామన్ మాత్రం ఈ పెట్రో ధరల పెంపు సామాన్యులపై భారం పడదు అని చెప్పుకొచ్చారు.

* సామాన్యుడికి కేంద్రం వాత

* పెట్రోల్, డీజిల్ పై అగ్రి సెస్(వ్యవసాయ సుంకం)

* భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

* లీటర్ పెట్రోల్ పై రూ.2.50, డీజిల్ పై రూ.4 వ్యవసాయ సెస్ విధింపు

* డీజిల్, పెట్రోల్ ట్యాక్సుల విషయంలో మార్పులు, చేర్పులు

* డీజిల్, పెట్రోల్ ట్యాక్సుల్లో మార్పులతో రాష్ట్రాలకు దెబ్బ

* మార్పులు, చేర్పులతో రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి

* ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం విధింపు

* ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు వాటా, సెస్సు మొత్తం కేంద్ర ఖజానాకే

* అగ్రి సెస్ తో పెట్రోల్ ధర సెంచరీ దాటే అవకాశం

* బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులు(ట్యాక్స్ పేయర్స్)కు నిరాశ

* ఆదాయపు పన్నుపై ఎలాంటి ప్రకటనా చేయలేదు

* గతంలో ఉన్న విధంగానే ఆదాయపు పన్ను శ్లాబులు కొనసాగింపు.