బీహార్ ఎన్నికలు : మొదటి దఫా అభ్యర్థుల్లో కోటీశ్వరులెందరు..నేరస్థులెందరో తెలుసా

  • Published By: venkaiahnaidu ,Published On : October 20, 2020 / 09:24 PM IST
బీహార్ ఎన్నికలు : మొదటి దఫా అభ్యర్థుల్లో కోటీశ్వరులెందరు..నేరస్థులెందరో తెలుసా

Bihar: 153 crorepatis in first phase poll fray మరో వారం రోజుల్లో బీహార్ లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. విమర్శలు,ప్రతి విమర్శలతో ఇప్పటికే బీహార్ లో రాజకీయం వేడెక్కింది. పరస్పర ఆరోపణలతో ప్రచారంలో మునిగిపోయాయి పొలిటికల్ పార్టీలు. అయితే, ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించి ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్​) పలు విషయాలు బయటపెట్టింది.



బిహార్‌ శాసనసభకు అక్టోబర్‌- 28న తొలి విడత ఎన్నికలు జరగనుండగా…… అన్ని పార్టీల నుంచి కలిపి 1064 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అయితే ఇందులో 31శాతం అంటే ఏకంగా 328 మందిపై నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్​ తెలిపింది. వీరిలో అయిదేళ్ల జైలు శిక్ష పడి నాన్‌ బెయిలబుల్‌ కేసులు వంటివి ఎదుర్కొంటున్న వారు 244 మంది ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా ఆర్జేడీకి చెందిన 41 మంది అభ్యర్ధుల్లో ఏకంగా 73 మంది శాతం మందిపై కేసులు ఉన్నట్లు తెలిపింది. బీజేపీ అభ్యర్ధుల్లో 71 శాతం మంది, లోక్‌ జనశక్తి అభ్యర్ధుల్లో 59శాతం మంది, కాంగ్రెస్‌ అభ్యర్ధుల్లో 57శాతం మంది, జేడీయూ అభ్యర్ధుల్లో 43శాతం మంది, బీఎస్పీ అభ్యర్ధుల్లో 31శాతం మందిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్​ తెలిపింది. మొత్తం అభ్యర్ధుల్లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న వారు 29 మంది ఉండగా, వీరిలో ముగ్గురిపై అత్యాచార కేసులు ఉన్నట్లు తెలిపింది. 21 మందిపై హత్యకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.



ఇక, అభ్యర్ధుల ఆర్థిక స్ధితిగతుల వివరాలనుకూడా ఏడీఆర్ వెల్లడించింది​. అన్ని పార్టీల నుంచి కలిపి బరిలో ఉన్న 1064 మందిలో 153 మంది కోటీశ్వరులు అని ఏడీఆర్ తెలిపింది. అత్యధికంగా ఆర్జేడీ అభ్యర్ధుల్లో 95 శాతం మంది కోటీశ్వరులు కాగా, జేడీయూ అభ్యర్ధుల్లో 89శాతం మంది, బీజేపీ అభ్యర్ధుల్లో 83శాతం మంది, ఎల్​జేపీ అభ్యర్ధుల్లో 73శాతం మంది, కాంగ్రెస్‌ అభ్యర్ధుల్లో 67శాతం మంది, బీఎస్పీ అభ్యర్ధుల్లో 46శాతం మంది కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్తులను ప్రకటించినట్లు ఏడీఆర్​ నివేదికలో తెలిపింది. 1064 మంది అభ్యర్ధుల సగటు ఆస్తి ఒక కోటి 99లక్షల రూపాయలని తెలిపింది.

కాగా, తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాలు, రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలు, మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు.