Nalanda crime : వరుడికి లవ్ ఎఫైర్..వధువు కాళ్లూ చేతులు కట్టేసి తల నరికేసిన దారుణం

Nalanda crime : వరుడికి లవ్ ఎఫైర్..వధువు కాళ్లూ చేతులు కట్టేసి తల నరికేసిన దారుణం

Bihar Nalanda Crime

Nalanda crime : అది బీహార్ లోని నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామం. ఆ గ్రామంలో 19 యువతికి పెళ్లి కుదిరింది. కొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది. పెళ్లి పనుల్లో అందరూ హడావిడిగా ఉన్నారు. ఇరు కుటుంబాల ఇళ్లల్లో పెళ్లి సందడిగా ఉంది. ఇంతలో ఊహించని దారుణం జరిగింది.

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాళ్లూ చేతులు కట్టేసి తల నరికి మొండాన్ని పారేసి పోయారు. తల లేని మొండాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సదరు యువతికి త్వరలో వివాహంకానుందనీ..ఇంతలోను దారుణ హత్యకు గురైనట్లుగా తెలిసింది.

నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు సరస్వతి పూజా సమయంలో వధువు కుటుంబం వరుడి కుటుంబ సభ్యులకు సుమారు 4 లక్షల విలువైన లాంఛనాలను కూడా ముట్టజెప్పారు. మరికొద్దిరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే వధువుని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు.

యువతి కాళ్లు, చేతులు కట్టేసి ఆమె తల నరికి కిరాతకంగా చంపేశారు. తల లేని యువతి మృతదేహాన్ని చూసి స్థానికులు హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తార్థారి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వరుడి లవ్ ఎఫైర్ కారణంగానే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఆజాద్ గతంలోనే మరో యువతితో ప్రేమాయనం నడిపాడని.. ఆమె బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కన్నీరు మున్నీరుగా విలపిస్తు చెప్పారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.