3 దశల్లో బిహార్ అసెంబ్లీ ​ఎన్నికలు…నవంబర్-​ 10న ఫలితాల ప్రకటన

  • Published By: venkaiahnaidu ,Published On : September 25, 2020 / 02:55 PM IST
3 దశల్లో బిహార్ అసెంబ్లీ ​ఎన్నికలు…నవంబర్-​ 10న ఫలితాల ప్రకటన

బిహార్​ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ఇవాళ(సెప్టెంబర్-25,2020)కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్‌ అరోరా ఈ వివరాలను వెల్లడించారు.


బిహార్​ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలకు 3 దశల్లో పోలింగ్​ జరగనుంది. అక్టోబర్​ 28న తొలి విడత పోలింగ్ జరగనుండగా… నవంబర్ 3న రెండో విడత… నవంబర్- 7మూడో విడత పోలింగ్ జరుగనుంది. అన్ని దశల ఓట్ల లెక్కింపు నవంబర్​ 10న జరగనుంది. బిహార్ ప్రస్తుత ‌ అసెంబ్లీ గడువు నవంబర్-‌ 29తో ముగియనున్న విషయం తెలిసిందే.



మొదటి  దశ పోలింగ్
16 జిల్లాల్లోని 71 స్థానాలకు పోలింగ్
31 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
అక్టోబర్ 1న నోటిఫికేషన్​ జారీ
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్​ 8
పోలింగ్ తేదీ అక్టోబర్-​ 28

రెండో దశ పోలింగ్
17 జిల్లాల్లోని 94 స్థానాలకు పోలింగ్
42 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
పోలింగ్ తేదీ నవంబర్-​ 3

మూడో దశ పోలింగ్
15 జిల్లాల్లోని 78 స్థానాలకు పోలింగ్
33.5 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
అక్టోబర్​ 13న నోటిఫికేషన్​ జారీ
పోలింగ్ తేదీ నవంబర్-​ 7


దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది.


కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్‌ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.