బీహార్ లో కేబినెట్ విస్తరణ..షానవాజ్,సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కజిన్ కు అవకాశం

బీహార్ లో కేబినెట్ విస్తరణ..షానవాజ్,సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కజిన్ కు అవకాశం

Bihar Cabinet బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మంగళవారంనాడు కేబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్తగా 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.గత ఏడాది నవంబర్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి క్యాబినెట్ విస్తరణ ఇది. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 17 మందిలో 9 మంది బీజేపీకి చెందిన వారు. మంత్రులకు శాఖల కేటాయింపులపైనా తుది నిర్ణయం తీసుకున్నామని… ప్రకటన ద్వారా త్వరలో ఆ విషయాలు వెల్లడిస్తామని సీఎం నితీశ్​​ కుమార్ తెలిపారు.

ఇక కొత్తవారితో కలిపి కేబినెట్​ మంత్రుల సంఖ్య 34కు చేరుకుంది. కేబినెట్​లో బీజేపీ తరపున 20 మంది ఉండగా, జేడీయూ 12 మందితో సరిపెట్టుకుంది. గతేడాది నవంబరులోనే కూటమిలో ఇతర పార్టీలైన హిందుస్తానీ ఆవామ్​ మోర్చా (హెచ్​ఏఎం), వికశీల్​ ఇన్సాన్​ పార్టీ (వీఐపీ​) పార్టీల నుంచి చేరోకరు కేబినెట్​లో స్థానం సంపాదించారు.

ఇక మొదటి నుంచి ఊహించినట్లుగానే బీజేపీ సీనియర్ నేత షానవాజ్​ హుస్సేన్​కు తాజాగా మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు నితీష్. షానవాజ్​, జమాఖాన్​ నియామకంతో మంత్రి వర్గంలో ముస్లిం నేతలు లేరనే విమర్శలకు తెరదించే ప్రయత్నం చేశారు. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్‌ తొలిసారి నితీష్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 20 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం విశేషం. నితీష్ క్యాబినెట్‌లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కజిన్,బీజేపీ నేత నీరజ్ సింగ్ బబ్లూ కూడా ఉన్నారు.