సుప్రీం తీర్పును గౌరవించాలి..మరో వివాదం రాకూడదు: బీహార్ సీఎం

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 06:59 AM IST
సుప్రీం తీర్పును గౌరవించాలి..మరో వివాదం రాకూడదు: బీహార్ సీఎం

అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దశాబ్దాలుగా వివాదంగా మారిపోయిన రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసుపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన క్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించాలని పిలుపునిచ్చారు. ఈ తీర్పు సామాజిక సామరస్యానికి మేలు చేస్తుందన్నారు. ఈ అంశంపై మరొకసారి వివాదం ఉండకూడదని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఇది ప్రజలకు నా విజ్ఞప్తి అని సీఎం నితీశ్ కుమార్ కోరారు.  

దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు స్వస్తి పలుకుతూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై చీఫ్ జడ్జి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చదివి వినిపించగా.. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. 

ప్రార్థనా మందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుందని వెల్లడించారు. వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని అన్నారు. పురావస్తు శాఖ నివేదికల ప్రకారమే తీర్పునిస్తున్నామని తెలిపారు.