బీహార్ విద్యాశాఖ మంత్రి రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : November 19, 2020 / 06:10 PM IST
బీహార్ విద్యాశాఖ మంత్రి రాజీనామా

Bihar education minister resigns బీహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీహార్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించిన సమయంలో నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మేవాలాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి అందజేశారు. అయితే, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నాలుగు రోజులు కూడా కాకముందే మేఘావాల్ రాజీనామా చేయడం బీహార్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.



కాగా,తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించిన మేవాలాల్ చౌదరి మాట్లాడుతూ… చార్జ్ షీటు ఫైల్ చేసినప్పుడు లేదా ఓ కోర్టు ఆదేశాలిచ్చినప్పుడు ఓ ఆరోపణ నిజమౌతుంది. నాపై వచ్చిన ఆరోపణలు నిరూపించేందుకు ఈ రెండూ జరుగలేదు అని అన్నారు.



మేవాల్ చౌదరి అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయనను విద్యాశాఖ మంత్రిగా నియమించడంపై బుధవారం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అవినీతికి పాల్పడినందుకు మేవాలాల్ చౌదరికి నితీష్ కుమార్ అవార్డ్ ఇచ్చారా..దోచుకునేందుకు ఆయనకు స్వేచ్ఛ ఇచ్చారా అని తేజస్వీ ప్రశ్నించారు.



అయితే, గతంలో భగల్పూర్ జిల్లాలోని సబౌర్ లోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన మేవాలాల్ చౌదరి ఆ సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ శాస్త్రవేత్తల పోస్టులకు నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017లో నితీష్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత చౌదరిపై క్రిమినల్ కేసు నమోదైంది.