బీహార్ లో మే-15వరకు మాల్స్,థియేటర్లు,విద్యాసంస్థలు బంద్..నైట్ కర్ఫ్యూ అమల్లోకి

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కఠినమైన కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.

బీహార్ లో మే-15వరకు మాల్స్,థియేటర్లు,విద్యాసంస్థలు బంద్..నైట్ కర్ఫ్యూ అమల్లోకి

Bihar

Bihar కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కఠినమైన కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. పాక్షిక లాక్‌డౌన్‌తో పాటు రాత్రి కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బీహార్ లో కరోనా వ్యాప్తిపై ఆదివారం ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన సీఎం నితీష్ కుమార్ పలు అంశాలపై చర్చించారు. అనంతరం బీహార్ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూతో కూడిన పాక్షిక లాక్‌ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కొన్నింటికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. బీహార్‌లో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 8,690 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కఠిన ఆంక్షలను విధించారు.

కొత్త ఆంక్షల ప్రకారం..బీహార్‌ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కూరగాయలు,పండ్లు,గుడ్లు,మాంసం, నిత్యావసర సరుకులు అమ్మే అన్ని షాపులకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతి. రెస్టారెంట్లు, ధాభాలో డైనింగ్‌కు అనుమతి లేదు.. కేవలం హోమ్ డెలివరీకి మాత్రమే అనుమతి( రాత్రి 9గంటల వరకే). మే-15వరకు అన్ని ప్రార్థనాలయాల మూసివేత. పెళ్లిళ్లకు 100 మంది, అంత్యక్రియలు 25 మంది మించకూడదు. సభలు, సమావేశాలకు అనుమతి లేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలకు సాయంత్రం 5 వరకే అనుమతి. మే 15 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేయబడతాయి.

మే-15వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్కూల్స్,యూనివర్శిటీలు ఎటువంటి పరీక్షలు నిర్వహించవు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటిస్తూ కఠిన ఆంక్షలు అమలు. మే-15వరకు సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, క్లబ్స్, పబ్లిక్ పార్క్‌లు,జిమ్ లు మూసివేస్తున్నట్లు సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఇదే సమయంలో, హెల్త్ కేర్ వర్కర్‌లకు ఈ ఏడాది కూడా ప్రోత్సాహకంగా ఒక నెల జీతం బోనస్ ఇవ్వనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, రద్దీ ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించాలని అన్ని జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.