ఆపరేషన్ చేయించుకున్నా గర్భం దాల్చింది…ప్రభుత్వాన్ని రూ. 11 లక్షలు డిమాండ్ చేసిన మహిళ

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ జరిగి రెండున్నర ఏండ్ల తర్వాత..గర్భం దాల్చడంతో అవాక్కయ్యింది.

ఆపరేషన్ చేయించుకున్నా గర్భం దాల్చింది…ప్రభుత్వాన్ని రూ. 11 లక్షలు డిమాండ్ చేసిన మహిళ

Operation

Bihar Woman : ఆ మహిళకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. అసలే పేదరికం. దీంతో సంతానం వద్దని అనుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ జరిగి సుమారు రెండు ఏండ్ల తర్వాత..గర్భం దాల్చడంతో అవాక్కయ్యింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. పరిహారంగా రూ. 11 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది.

బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ ప్రాంతంలో పుల్ కుమారి దేవి, దాస్ దంపతులు నివాసం ఉంటున్నారు. పేద కుటుంబం. వీరికి నలుగురు సంతానం ఉంది. ఐదో సంతానం వద్దని అనుకుంది. 2019, జులై 27వ తేదీన మోతీపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. డాక్టర్ సుధీర్ కుమార్ ఆపరేషన్ నిర్వహించారు.

అయితే..కొన్ని రోజుల క్రితం గర్భం దాల్చడంతో అవాక్కయ్యింది. తన భర్త దినసరి కూలీ అని, ఇందుకోసం హర్యానాలోని పానిపట్ లో పని చేస్తున్నాడని పుల్ కుమారి వెల్లడించింది. నలుగురు పిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో..వినియోగదారుల కోర్టును ఆశ్రయించినట్లు మహిళ వెల్లడించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమైనందుకు పుట్టబోయే బిడ్డకు ఖర్చుల కింద పరిహారంగా రూ. 11 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. డాక్టర్ ను నిలదీసినందుకు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఆ మహిళ ఆరోపించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ విఫలంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ముజఫర్పూర్ సివిల్ సర్జన్ డాక్టర్ హరేంద్ర కుమార్ అలోక్ సోమవారం బదిలీకి ముందు తెలిపారు. ఒక్కోసారి ఆపరేషన్లు విఫలమౌతాయని, అలాంటి సందర్భాల్లో నిబంధనల ప్రకారం బాధితులకు రూ. 30 వేలు పరిహారం చెల్లించడంతో పాటు..డెలివరీ, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.