Bill Gates: మూడు నెలల్లో ప్రమాదంలో ప్రపంచం.. బిల్‌గేట్స్ సంచలనం!

మూడేళ్లుగా యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి "ఒమిక్రాన్" రూపంలో విజృంభిస్తోంది.

Bill Gates: మూడు నెలల్లో ప్రమాదంలో ప్రపంచం.. బిల్‌గేట్స్ సంచలనం!

Bill Gates

Bill Gates: మూడేళ్లుగా యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి “ఒమిక్రాన్” రూపంలో విజృంభిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ భారత్ సహా పశ్చిమ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూకే సహా యూరోప్ దేశాల్లో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతుండగా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా ఒమిక్రాన్ ప్రమాదకరంగా తయారవుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రజలు, ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండకపోతే మరో మూడు నెలల్లోనే ఒమిక్రాన్ ప్రపంచాన్ని కుదిపేసే ప్రమాదం ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా మాట్లాడిన బిల్ గేట్స్.. ఒమిక్రాన్ మిగిలిన వైరస్‌ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, మహమ్మారి వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధ్యమైనంత వరకు మాస్కులు ధరించి, ఇళ్లలోనే ఉండాలని, వాక్సిన్ వేయించుకోవాలని కోరారు. సెలవుల సీజన్లో తన వ్యక్తిగత పర్యటనలను సైతం రద్దు చేసుకుంటున్నట్లు బిల్ గేట్స్ వెల్లడించారు.

ఒమిక్రాన్ ప్రభావం మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది మాత్రం ఇంకా అంచనాలు లేవని, డెల్టా వేరియెంట్ కంటే మాత్రం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ వేరియంట్‌ని మాత్రం తేలిగ్గా తీసుకోవల్సిన అవసరం లేదన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించాలంటే మాత్రం.. మనతో పాటు మన సంబంధీకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు బిల్‌గేట్స్. చిన్న దేశాలు, పేదలు, మురికివాడల్లో నివసించే వారిపై ప్రత్యేక దృష్టిని ప్రభుత్వాలు పెట్టాలని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.

వ్యాధి తీవ్రత తగ్గించేందుకు వాక్సిన్ పంపిణీని మరింత వేగవంతం చేయాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, పాక్షిక రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికీ బూస్టర్ డోసు ఇవ్వాల్సిన అవసరం బిల్ గేట్స్ ట్విట్టర్‌లో వెల్లడించారు. రెండు డోసుల వాక్సిన్ తీసుకున్నవారికి సైతం ఒమిక్రాన్ సోకుతున్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో “తక్షణమే బూస్టర్ డోసు” ఇస్తే మంచిదని కూడా అన్నారు గేట్స్. సరైన జాగ్రత్తలు ప్రజలు, ప్రభుత్వాలు తీసుకుంటే, మహమ్మారికి 2022లోనే ముగింపు పలకవచ్చని కూడా అన్నారు బిల్ గేట్స్.