Rakesh Jhunjhunwala : విమానయాన రంగంలోకి రాకేష్ ఝన్‌ఝన్‌వాలా!

భారత వారెన్ బఫెట్ గా పేరుపొందిన బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా...భారత్ లో అతి తక్కువ ఖర్చుతో కూడిన ఓ కొత్త విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు.

Rakesh Jhunjhunwala : విమానయాన రంగంలోకి రాకేష్ ఝన్‌ఝన్‌వాలా!

Rakesh Jhunjhunwala భారత వారెన్ బఫెట్ గా పేరుపొందిన బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా విమానయాన రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా ఓ చౌక విమానయాన సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు.

పెద్దసంఖ్యలో పేద, మధ్యతరగతి ప్రజలు విమానాల్లో ప్రయాణించేలా చేయాలన్న ఉద్దేశ్యంతో నాలుగేళ్లలో 70 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీని కోసం మరో పదిహేను రోజుల్లో భారత విమానయాన మంత్రిత్వశాఖ నుంచి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ తీసుకోనున్నట్లు తెలిపారు. 180 మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న విమానాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు.

‘ఆకాశ ఎయిర్‌లైన్స్‌’గా పిలవబోయే తమ కంపెనీ.. ప్రయాణికులకు అత్యంత చౌకగా విమాన సేవలు అందించనుందన్నారు. “అకాశ ఎయిర్” గా పిలువబడే కొత్త విమానయాన సంస్థ ఏర్పాటు కోసం ఝన్‌ఝన్‌వాలా..35 మిలియన్ డాలర్లు పెట్టుబడి(సంస్థలో 40 శాతం వాటా)పెట్టనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో విస్తృత అనుభవం ఉన్న ప్రముఖులు తన భాగస్వాములుగా ఉండనున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్‌, దేశీయ కంపెనీ ఇండిగోలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు తనతో కలిసి వస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లో విమనయాన రంగానికి భారీ డిమాండ్‌ ఉండనున్నట్లు అంచనా వేశారు.

అయితే మార్కెట్‌లో చార్జీల మోత, అధిక వ్యయాల కారణంగా కింగ్ ఫిషర్,జెట్ ఎయిర్ వేస్ వంటి కొన్ని విమానయాన సంస్థలు కూలిపోవడాన్ని చూసిన తర్వాత కూడా రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా సాహసోపేతమేనన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వెల్లువెత్తుతున్నాయి.