Bengaluru Floods : లగ్జరీ కార్లు వదిలి ట్రాక్టర్లు ఎక్కుతున్న వీఐపీలు .. విలాసవంతమైన భవనాలు వదిలి హోటల్స్‌లో రూమ్‌ల కోసం పడిగాపులు

బెంగళూరులోని కార్పొరేట్, వ్యాపార ప్రముఖులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ఎప్సిలాన్ ఇప్పుడు చిన్నపాటి నదిని తలపిస్తోంది. రిచెట్‌ గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు చెరువులను తలపిస్తున్నాయి. సిలీకాన్ సిటీలో నివాసముండే రిషద్ ప్రేమ్‌జీ, బైజూ రవీంద్రన్, వరుణ్ బెర్రీ లాంటి బిలియనీర్‌లకు కూడా వరద కష్టాలు తప్పడం లేదు. వరదల బారిన పడిన బిలియనీర్లలో అనాకాడెమీకి చెందిన గౌరవ్ ముంజాల్ కూడా ఉన్నారు. అతను అతని ఫ్యామిలీ ట్రాక్టర్‌లో వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Bengaluru Floods : లగ్జరీ కార్లు వదిలి ట్రాక్టర్లు ఎక్కుతున్న వీఐపీలు .. విలాసవంతమైన భవనాలు వదిలి హోటల్స్‌లో రూమ్‌ల కోసం పడిగాపులు

Bengaluru Floods ViPS cars

Bengaluru Floods : సిలికాన్‌ సిటీ.. ఇండియాకే ఐటీ హబ్‌.. సూపర్‌ సిటీ.. కూల్‌ వెదర్‌.. ఫ్రెండ్లీ పీపుల్‌.. ఇవన్నీ బెంగళూరును పొగిడేందుకు వాడే మాటలు.. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే ! అదే నాణానికి మరోవైపు అడ్డగోలుగా ఆక్రమణలు.. చెరువుల్లో వెలసిన భవనాలు.. కాల్వల్ని ఆక్రమించి నిర్మాణాలు..! అందుకే చినుకుపడితే నగరం నదిలా మారిపోతుంది. ఇప్పుడు బెంగళూరుని ముంచెత్తిన వరదలతో అపార్ట్‌మెంట్లు, విల్లాలు కూడా నీట మునిగాయి. దీంతో ఎప్పుడూ లగ్జరీ కార్లలో తిరిగే వీఐపీలు ఇప్పుడు ట్రాక్లర్లు ఎక్కుతున్నారు. విలాసవంతమైన భవనాల్లో ఉండే వీవీఐపీలు.. ఇప్పుడు హోటల్స్‌లో రూమ్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు.

బెంగళూరులోని కార్పొరేట్, వ్యాపార ప్రముఖులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ఎప్సిలాన్ ఇప్పుడు చిన్నపాటి నదిని తలపిస్తోంది. రిచెట్‌ గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు చెరువులను తలపిస్తున్నాయి. సిలీకాన్ సిటీలో నివాసముండే రిషద్ ప్రేమ్‌జీ, బైజూ రవీంద్రన్, వరుణ్ బెర్రీ లాంటి బిలియనీర్‌లకు కూడా వరద కష్టాలు తప్పడం లేదు. వరదల బారిన పడిన బిలియనీర్లలో అనాకాడెమీకి చెందిన గౌరవ్ ముంజాల్ కూడా ఉన్నారు. అతను అతని ఫ్యామిలీ ట్రాక్టర్‌లో వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇషాన్‌ మిట్టల్‌ అపార్ట్‌మెంట్‌లో కరెంటు, వాటర్‌ లేకపోవడంతో తన సొసైటీలోని 300 కుటుంబాలను ఖాళీ చేయించారు. ఎలైట్ సొసైటీ కూడా పూర్తిగా నీట మునిగింది. ఎలైట్‌ సొసైటీలోని జర్మన్, ఇటాలియన్ కార్లు వరద నీట్లో తేలుతున్నాయి.

కుండపోత వర్షాలతో బెంగళూరు నగరం పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోవడమంటే అలా.. ఇలా కాదు. సిటీ సముద్రమైంది. కార్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. బైక్‌లు నీటిలో ఈత కొట్టాయి. అపార్ట్‌మెంట్లు నదుల్ని తలపించాయి. సెల్లార్లు చెరువులయ్యాయి. కాస్ట్లీ విల్లాలు కూడా వరద నీట్లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల సంగతైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఇళ్లల్లోకి నాలుగైదు అడుగుల లోతున వరద నీరు చేరడంతో.. జనం ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అది నగరమా లేదంటే నదా అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రకృతికి కోపమొస్తే.. చిన్నాపెద్దా.. ఉన్నోళ్లు.. లేనోళ్లన్న తేడా ఉండదని మరోసారి రుజువైంది. కోట్ల రూపాయల విలువైన విల్లాలు ఉండే కమ్యూనిటీలు కూడా ఖతమయ్యాయి. ఒక్కో విల్లాను 13 కోట్లు పెట్టి కొని.. అందులో దర్జాగా బతికే బడా బాబులు కూడా వరుణుడి ప్రతాపానికి వణికిపోయారు. కోట్ల రూపాయల విలువైన కార్లు.. లక్షల విలువైన కాస్ట్‌లీ వస్తువులు నీటి పాలయ్యాయి. చివరకు విల్లాల నుంచి బయటకు వచ్చే దారి కూడా మూసుకుపోయింది.

బెంగళూరులోని రిచ్‌ పీపుల్‌ అంతా తమ సొంత ఇళ్లు వదిలేసి హోటల్స్‌లో రూమ్‌ల కోసం పరుగులు పెడుతున్నారు. అందరి ఇళ్లు పూర్తిగా వరదనీటితో నిండిపోవడంతో అంతా హోటల్స్‌ వైపు చూస్తున్నారు. సాధారణ సమయాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్‌లో రూమ్స్‌.. 10వేల నుంచి 20వేల ఉండేవి. కానీ ఇప్పుడు డిమాండ్‌ పెరగడంతో దొరికిందే సందుగా ఆ రేట్లు డబుల్ చేశారు. ఒక రాత్రి హోటల్‌ లో ఉండాలంటే 40వేల డిమాండ్‌ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైట్‌ ఫీల్డ్‌, ఔటర్ రింగ్‌ రోడ్, ఓల్డ్ ఎయిర్ పోర్ట్‌ రోడ్‌లోని హోటల్స్‌ గదులు ఇప్పటికే బుక్ అయిపోయాయి.

వరుణుడు సృష్టించిన బీభత్సంతో బెంగళూరులో ఎక్కడ చూసిన వరదనీరే కనిపిస్తుంది..! రోడ్డుపై నడవలేని పరిస్థితి.. పోని.. బైక్‌ మీదనో, కారులోనూ వెళ్దామంటే రోడ్డుపై ఎక్కడ గుంతలున్నాయో తెలియదు..! ఇదంతా ప్రధాన రహదారుల దుస్థితి..! అటు లోతట్టు ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణం. అసలు కార్లు, బైకులు రోడ్డుపై కొట్టుకుపోయాయి. కొన్ని వరద నీటికి మునిగిపోయాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లోకి నీరు ప్రవేశించండంతో వాహనాలు వరదపాలయ్యాయి. ఒక్క రోజు కాదు.. రెండు రోజుల కాదు.. మూడు రోజులుగా ఇదే పరిస్థితి..! దీంతో బెంగళూరు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టిపెట్టారు. ట్రాక్టర్లు ఎక్కి ఆఫీస్‌లకు వెళుతున్నారు. లక్షలు సంపాదించే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా ఇప్పుడు ఒకే ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్నారు.