ఎన్నికల వేళ క్రికెటర్‌పై ఎటాక్.. తృణమూల్ నేతలే దాడి చేశారా?

ఎన్నికల వేళ క్రికెటర్‌పై ఎటాక్.. తృణమూల్ నేతలే దాడి చేశారా?

Bjp Candidate Ashok Dinda Attacked

BJP Candidate Ashok Dinda Attacked: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు రాష్ట్రంలో వెటరన్ క్రికెటర్‌పై జరిగిన దాడి వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భారత క్రికెటర్, మోయినాకు చెందిన బిజెపి అభ్యర్థి అశోక్ దిండాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ నేతల మధ్య దాడులు సర్వసాధారణం అయిపోయాయి. రాష్ట్రంలో ప్రతి రోజు ఎదో ఒక చోట ఇరుపార్టీల నేతలు దాడులకు దిగుతూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎన్నికల వేళ మంగళవారం ప్రచారం ముగించుకొని వస్తున్న బీజేపీ మొయినా అభ్యర్థి, క్రికెటర్ అశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో దిండా తీవ్రంగా గాయపడగా.. మొయినాలో రోడ్డు షో ముగించుకొని వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ప్లాన్ ప్రకారం అశోక్ దిండా వెళ్తున్న మార్గాన్ని బ్లాక్ చేసిన 50మందికిపైగా దుండగులు కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేశారని ఆరోపిస్తుంది బీజేపీ. అశోక్ దిండాను వాహనంలోంచి కిందకు దింపి దాడి చేయగా.. ఆ సమయంలో దిండాతో పాటు కొందరు బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. వారిపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తుంది.

తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతో తనపై దాడి చేసినట్లుగా దిండా ఆరోపించారు. తృణమూల్ నేతలు మాత్రం.. సింపతికోసం అశోక్ సొంతపార్టీ వారితోనే కొట్టించుకున్నాడని అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దిండా 2009 నుంచి 2013 వరకు భారత జట్టు తరపున మ్యాచ్‌లు ఆడగా.. ఐపీఎల్‌లో 2017వరకు కొనసాగారు. క్రికెట్ కు స్వస్తిచెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టారు.