పారికర్ కుమారుడికి బీజేపీ షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : April 28, 2019 / 03:12 PM IST
పారికర్ కుమారుడికి బీజేపీ షాక్

మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది.కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 అసెంబ్లీ స్థానాలకు,గోవాలో 1 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం(ఏప్రిల్-28,2019)విడుదల చేసింది. కర్ణాటకలోని చించోలి స్థానానికి అవినాష్ జాదవ్,కుండ్గోల్ స్థానానికి చిక్కనగౌడర్ పేరుని ప్రకటించింది.గోవాలోని పనాజీ అసెంబ్లీ స్థానానికి సిద్దార్ద్ శ్రీపాద్ కుంకలియేంకర్ పేరుని బీజేపీ ప్రకటించింది. మనోహర్ పారికర్ మరణంతో పనాజీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతన్న విషయం తెలిసిందే. 

పనాజీ స్థానానికి అభ్యర్థిగా పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పేరుని బీజేపీ ప్రకటిస్తుందని అందరూ భావించారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించడానికి తాను సిద్దంగా ఉన్నానని కూడా ఇటీవల ఉత్పల్ ప్రకటించారు.అయితే అన్ని విధాల ఆలోచించిన తర్వాత పారికర్ అనుచరుడైన సిద్దార్ద్ శ్రీపాద్ పేరుని బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ)ఫైనల్ చేసినట్లు సీఈసీ సెక్రటరీ జేపీ నడ్డా తెలిపారు.

 2015 లో పనాజీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా సిద్దార్ద్ శ్రీపాద్ విజయం సాధించారు.2017 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.అయితే మనోహర్ పారికర్ కోసం సిద్దార్ద్ తన సీటు వదులుకున్నారు.మే-19,2019న పనాజీ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి అటనాసియో మోన్సీరట్టీ పోటీలో ఉన్నారు.