Political Parties Assets: రాజకీయ పార్టీల ఆస్తుల లెక్కలు ఇవే.. బీజేపీనే టాప్.. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ..?

కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే ధనిక పార్టీగా నిలిచింది.

Political Parties Assets: రాజకీయ పార్టీల ఆస్తుల లెక్కలు ఇవే.. బీజేపీనే టాప్.. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ..?

Ycp Tdp

Political Parties Assets: కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే ధనిక పార్టీగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి బీజేపీ ఆస్తుల విలువ 4వేల 847కోట్లుగా ప్రకటించింది. బీజేపీ తర్వాత అత్యంత ధనిక రాజకీయ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ రెండో స్థానంలో ఉంది. ఎన్నికల సంస్కరణల దిశగా కృషి చేస్తున్న అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) ఈ గణాంకాలను విడుదల చేసింది.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 2019-20లో జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను సిద్ధం చేసింది. ADR ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో ఏడు జాతీయ, 44 ప్రాంతీయ పార్టీలు మొత్తం 51పార్టీలు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.9,117.95కోట్లు. అందులో జాతీయ పార్టీల ఆస్తుల విలువ రూ.6,988.57 కోట్లు కాగా.. ప్రాంతీయ పార్టీల ఆస్తుల విలువ రూ.2,129.38 కోట్లు.

ఏడు జాతీయ పార్టీల్లో బీజేపీ అత్యధికంగా రూ.4847.78 కోట్లు.. అంటే 69.37శాతం ఉన్నాయి. బీఎస్పీ రూ.698.33 కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. జాతీయ పార్టీల్లో మొత్తం ఆస్తుల్లో 9.99 శాతం ఈ పార్టీ దగ్గరే ఉంది. పురాతన రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ 2019-20లో రూ. 588.16 కోట్ల ఆస్తులను ప్రకటించింది. ఇది జాతీయ పార్టీల మొత్తం ఆస్తులలో 8.42 శాతం.

మొత్తం 44 ప్రాంతీయ పార్టీల్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో సమాజ్‌వాదీ పార్టీ అత్యధికంగా రూ.563.47 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించింది. ఇక టీఆర్‌ఎస్‌ ఆస్తులు రూ.301.47 కోట్లు, ఏఐఏడీఎంకే ఆస్తులు రూ.267.61 కోట్లుగా ఉన్నాయి. జాతీయ పార్టీలలో BJP, BSP ఫిక్స్‌డ్ డిపాజిట్ కేటగిరీ కింద రూ. 3,253.00 కోట్లు, రూ. 618.86 కోట్లు ప్రకటించాయి. కాంగ్రెస్‌ రూ. 240.90 కోట్లు ప్రకటించింది.

ప్రాంతీయ పార్టీల్లో, ఎఫ్‌డిఆర్, ఫిక్స్‌డ్ డిపాజిట్ కేటగిరీ కింద సమాజ్‌వాదీ పార్టీ గరిష్ట ఆస్తులు రూ.563.47 కోట్లు, టీఆర్‌ఎస్‌ రూ.301.47 కోట్లు, ఏఐఏడీఎంకే రూ.267.61 కోట్లుగా ప్రకటించాయి. జాతీయ పార్టీల్లో అతి తక్కువగా రూ.8కోట్ల 20లక్షలతో ఎన్సీపీ ఏడోస్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మూడు పార్టీలు తెలుగుదేశం, టీఆర్ఎస్, వైసీపీ ఆస్తుల వివరాల్లోకి వస్తే.. టీఆర్ఎస్ పార్టీ దగ్గర రూ. 301కోట్లు, టీడీపీ దగ్గర 188కోట్లు వైసీపీ దగ్గర రూ. 143కోట్ల ఆస్తులు ఉన్నాయి.

ఆస్తులపరంగా దేశంలో రెండో స్థానంలో ఉండే BSPకి అప్పు మాత్రం ఒక్క రూపాయి లేదు. ఆస్తుల్లో మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అప్పుల్లో మొదటిస్థానంలో ఉంది. ఈ పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులు ఉండగా, రూ.30కోట్ల అప్పులతో తెలుగుదేశం పార్టీ రెండోస్థానంలో ఉంది. టీఆర్ఎస్ రూ.4కోట్ల అప్పుతో ఉండగా.. వైసీపీ అప్పుల విషయాన్ని ప్రకటించలేదు. ఏడు జాతీయ పార్టీల అప్పులు రూ.74.27 కోట్లు, 44 ప్రాంతీయ పార్టీల అప్పులు రూ.60.66 కోట్లుగా ఉంది.