మోడీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2020 / 06:12 PM IST
మోడీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్

BJP loses election in Varanasi దేశంలో ఎక్కడా ఎన్నిక జరిగినా సత్తా చూపెడుతూ దుసుకుపోతున్న భారతీయ జనతాపార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దగా కలిసిరానట్లు కనిపిస్తోంది. గతవారం మహారాష్ట్రలో ఆరు సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుని మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. అయితే గ్రాడ్యుయేట్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన నాగ‌పూర్‌ లో బీజేపీ ఓడిపోవ‌డం దారుణం. గ‌తంలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ,మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ రావు ఫడ్నవీస్ ప్రాతినిధ్యం వహించిన ఆర్ఎస్ఎస్ అడ్డా అయిన నాగ‌పూర్‌లో బీజేపీ ప‌రాజ‌యం పాలైంది.



కాగా, మహారాష్ట్ర పరాభవాన్ని మరిచిపోక ముందే ఉత్తరప్రదేశ్‌ లో ఇప్పుడు బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగలింది. అది కూడా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశిలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. యూపీలోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్-1న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 5 పట్టభద్రుల నియోజకవర్గాలు, 6 ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.



డిసెంబర్-6న యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే,ఈ ఫలితాలు చూసిన కాషాయపార్టీ కంగుతింది. మొత్తం 11 స్థానాల్లో 6 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. 3 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ,2 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు సీట్లను బీజేపీ కోల్పోయింది.



వారణాశిలో ఎన్నికలు జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) సొంతం చేసుకుంది. అందులో ఒకటి ఉపాధ్యాయుల నియోజకవర్గం కాగా, మరొకటి పట్టభద్రుల నియోజకవర్గం. వారణాసి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సమాజ్‌ వాదీ అభ్యర్థి అశుతోశ్ సిన్హా బీజేపీ అభ్యర్థి కేధార్ నాథ్ సింగ్ పై 3,580ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి లాల్‌ బిహారీ యాదవ్ స్వతంత్ర అభ్యర్థి ప్రమోద్ కుమార్ మిశ్రాపై 936ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చేత్ నారాయణ్ సింగ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.



కాగా,ఉపాధ్యాయుల నియోజకవర్గం మరియు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు చేత్ నారాయణ్ సింగ్, కేధార్ నాథ్ సింగ్ లు గత మూడు ఎన్నికల నుంచి విజయం సాధిస్తూ వచ్చి ఈ సారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే,బీజేపీకి ఇది రాజకీయంగా పెద్దగా ఇబ్బంది కలిగించే పరిణామం కాకపోయినప్పటికీ.. ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తాము గెలుపొందడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సమాజ్‌వాదీ నేతలు ప్రకటించారు.



ఇక్కడ మరో ఆశక్తికర విషయం ఏంటంటే..ఎన్నికలు జరిగే ఒక్క రోజు ముందు నవంబర్-30న ప్రధాని మోడీ వారణాశిలో పర్యటించారు. వారణాశి పర్యటనలో రెండు పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొన్న ప్రధాని విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో రైతుల ఆందోళనకు విపక్షాలే కారణమంటూ తీవ్ర స్థాయిలో మోడీ ఫైర్ అయ్యారు. తన పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారా అని ఈ సమయంలో తన నియోజకవర్గ ఓటర్లను మోడీ ప్రశ్నించారు. అప్పుడు చాలామంది బీజేపీ ఆహ్వానించిన ఆడియన్స్ ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. కానీ వారణాసి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం మరియు వారణాసి ఉపాధ్యాయుల నియోజకవర్గ ఓటర్లను మాత్రం మోడీ ఆకట్టుకోలేనట్లు కనిపిస్తోంది.



2014లో తొలిసారి ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికై ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి వారణాశి నుంచే పోటీ చేసి ఘనవిజయం సాధించారు మోడీ.