అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, 19లక్షల ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

  • Published By: naveen ,Published On : October 22, 2020 / 12:33 PM IST
అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, 19లక్షల ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

BJP manifesto: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఓటర్లను అట్రాక్ట్ చేసే విధంగా మేనిఫెస్టోలు రూపొందించాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేయగా… తాజాగా బీజేపీ కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం(అక్టోబర్ 22,2020) బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనావైరస్ ప్రస్తావన ప్రధానంగా కనిపించింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కరోనావైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో తెలిపింది.

19లక్షల కొత్త ఉద్యోగాలు:
ఇప్పటికే పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచాయి. తాజాగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై మేనిఫెస్టోల్లో స్పష్టతనిచ్చాయి. బీజేపీ అధికారంలోకి వస్తే కరోనావైరస్ వ్యాక్సిన్ రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ ఉచితంగా అందజేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చింది బీజేపీ. అలాగే రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 19 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కొత్తగా 3 లక్షల టీచర్ పోస్టులు భర్తీ:
ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న ఆత్మనిర్భర్ భారత్‌ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని మేనిఫెస్టోలో ప్రధానాంశంగా కనిపిస్తోంది. బీఈడీ చేసి ఉద్యోగం లేక టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి కూడా బీజేపీ శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, విశ్వ విద్యాలయాల్లో కొత్తగా 3 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది. పేదల కోసం 30 లక్షల పక్కా ఇళ్లను 2022 నాటికి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో ఆరోగ్య రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ శాఖలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామంది. అలాగే 2022 నాటికి 30లక్షల మందికి పక్కా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. బీహార్ ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి అధికారాన్ని నిలుపుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

”బీహార్ ప్రజలు తెలివైన వారు. అన్నీ గమనిస్తున్నారు. పార్టీలు ఇస్తున్న ఎన్నికల వాగ్దానాలను అర్థం చేసుకోగలరు. ఎవరైనా మా మేనిఫెస్టో గురించి ప్రశ్నిస్తే, వారికి ఎంతో విశ్వాసంతో సమాధానం ఇవ్వగలం. మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాం. ఎన్డీయే పాలనలో బీహార్ లో జీడీపీ వృద్ధి చెందింది. గత 15 ఏళ్లలో జీడీపీ 3 శాతం నుంచి 11.3శాతానికి పెరిగింది. అంతకముందు 15 ఏళ్ల జంగిల్ రాజ్ లో ఎలాంటి పురోగతి లేదు.

మా ప్రభుత్వం అందించిన సుపరిపాలన వల్లే అది సాధ్యమైంది” అని నిర్మలా సీతారామన్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, నితీష్ కుమార్ కి చెందిన జనతా దళ్(యు) కూటమిగా పోటీ చేస్తున్నాయి. 2005 నుంచి(2013-17 మినహాయిస్తే) ఈ కూటమి అధికారంలో ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దశల్లో జరగనున్నాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 9 వరకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెల్లడిస్తారు.

బీజేపీ బీహార్ ఎన్నికల మేనిఫెస్టో:
* రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా కరోనావైరస్ వ్యాక్సిన్
* కొత్తగా 19లక్షల ఉద్యోగాలు
* 30లక్షల మందికి పక్కా ఇళ్లు
* రాష్ట్రంలో నెక్ట్స్ జనరేషన్ ఐటీ హబ్ అభివృద్ధి, దాని ద్వారా రానున్న ఐదేళ్లలో 5లక్షల ఉద్యోగాలు
* దర్బాంగాలో 2024 నుంచి ఎయిమ్స్ అందుబాటులోకి వస్తుంది
* కొత్తగా 3లక్షల టీచర్ పోస్టులు భర్తీ