అనుమానాస్పద స్థితిలో బెంగాల్ బీజేపీ MLA మృతి…ఉరికి వేలాడుతూ

  • Published By: venkaiahnaidu ,Published On : July 13, 2020 / 08:33 PM IST
అనుమానాస్పద స్థితిలో బెంగాల్ బీజేపీ MLA మృతి…ఉరికి వేలాడుతూ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మరణం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. హెమ్తాబాద్‌ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచిన దేవేంద్రనాథ్‌ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరారు.

నార్త్ దినాజ్‌పూర్‌ జిల్లాలోని బిందాల్ గ్రామంలో తన నివాసానికి సమీపంలోని మార్కెట్‌ దగ్గర సోమవారం ఉదయం ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మార్కెట్‌లోని ఆయనకు చెందిన షాపు ముందు ఉరి వేసుకున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున 1 గంట సమయంలో కొంతమంది ఎమ్మెల్యేను పిలిచారని, ఆ తర్వాత స్థానికులు ఎమ్మెల్యే చనిపోయినట్లు గుర్తించారు అని ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు

దేవేంద్రనాథ్‌ను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని బంధువులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా చాలామంది తమ పార్టీ కార్యకర్తలు… తృణముల్ కాంగ్రెస్ హింసలో చంపబడ్డారని బీజేపీ నాయకులూ ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే మృతి కేసును సిబిఐకు అప్పగించాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, దేవేంద్రనాథ్‌ మృతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆయన ధ్వజమెత్తారు. కాగా, మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు రూపా గంగూలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవేంద్రనాథ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘ఆయన తన షాపు ముందర ఉరి ఎందుకు వేసుకుంటారు? తాను ఆ పరిస్థితుల్లో అందరికీ కనిపించాలని అలా చేశారా’ అని రూపా గంగూలీ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే మృతి ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.