టీఎంసీలో చేరిన భార్యకు విడాకులిస్తానన్న బీజేపీ ఎంపీ

10TV Telugu News

BJP MP Says Will Divorce Wife Who Joined Trinamool వెస్ట్ బెంగాల్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మొండల్ ఖాన్.. సోమవారం ఉదయం తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)లో చేరిన విషయం తెలిసిందే. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ లో చేరిన తన భార్యకు విడాలిచ్చేందుకు సిద్ధమంటూ ఎంపీ సౌమిత్ర ఖాన్ కీలక ప్రకటన చేశారు. తన భార్య టీఎంసీలో చేరిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ ప్రకటన చేశారు. రాజకీయాలు తన వివాహా బంధాన్ని ముగించేశాయని ఆయన తెలిపారు.

రాజకీయాల కారణంగా 10ఏళ్ల బంధం ముగిసిందని..ఇకపై బీజేపీ కోసం మరింత కష్టపడి పనిచేస్తానని సౌమిత్ర ఖాన్ తెలిపారు. అయితే,భార్యలానే సౌమిత్రఖాన్ కూడా త్వరలో టీఎంసీలో చేరుతాడని వస్తున్న వార్తలను ఈ సందర్భంగా కొట్టిపారేశారు సౌమిత్ర ఖాన్. తాను తన భార్య బాటలో వెళ్లనని,తాను బీజేపీలోనే కొనసాగుతానని ఆయన సృష్టం చేశారు.

కాగా,ఎంపీ సౌమిత్ర ఖాన్ గతంలో తృణముల్ కాంగ్రెస్ నాయకుడే. 2014లో బిషన్ పూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా పోటీ చేసి విజయం కూడా సాధించారు. అయితే 2019 జనవరిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను ఆయనను తృణముల్ పార్టీ నుంచి తొలగించింది మమతా బెనర్జీ. దీంతో ఆయన బీజేపీలో చేరి గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే సౌమిత్ర ఖాన్ విజయంలో ఆయన భార్య సుజాత మోండాల్ ఖాన్ పాత్ర చాలా కీలకమైనది. ఓ క్రిమినల్ కేసు నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం పోటీ చేసిన బిషన్ పూర్ నియోజకవర్గంలో ఆయన అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఆయన భార్య సుజాత మోండాల్ ఖాన్ ఒంటిచేత్తో క్యాంపెయిన్ నడిపించి తన భర్త విజయంలో కీలక పాత్ర పోషించింది. సుజాత ఖాన్ బీజేపీ సభ్యురాలుగా గతంలో మోడీతో కలిసి వేదికను కూడా పంచుకున్నారు.

అయితే, తన భర్త ఎంపీగా విజయం సాధించడం కోసం… భౌతికదాడులను కూడా ఎదుర్కొన్నానని, చాలా త్యాగం చేసినప్పటికీ తనకు ప్రతిఫలం దక్కలేదని సుజాత ఆరోపించారు. ఇవాళ రిపోర్టర్లతో మాట్లాడిన సుజాత…మీ నిర్ణయం పట్ల మీ భార్త ఎలా ఫీల్ అయ్యారు అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… నా కుటుంబం,రాజకీయాలు వేర్వేరు. అయితే నా భార్త ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆయన ఇష్టం. ఏదో ఒకరోజు ఆయన అర్థం చేసుకుంటారు. ఎవరికి తెలుసు.. ఏదో ఒక రోజు ఆయన కూడా తృణముల్ కాంగ్రెస్ కి తిరిగి రావచ్చు. నేను ఊపిరిపీల్చుకోవాలనుకుంటున్నాను. నాకు గౌరవం కావాలి. ఒక సమర్థవంతమైన పార్టీలో సమర్థవంతమైన లీడర్ అవ్వాలనుకుంటున్నానని ఆమె అన్నారు.

దీదీతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. బీజేపీలో… కొత్తగా చేరిన నేతలకు,అసమర్థులకు,అవినీతి నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని సుజాత విమర్శించారు. కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో టీఎంసీని వీడి బీజేపీలోకి వెళ్లిపోతున్న నేలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత శనివారం తృణముల్ కాంగ్రెస్ చరిత్రలో ఒక గుర్తుపెట్టుకోదగిన రోజు. ఎమ్మెల్యేలు,ఓ ఎంపీ సహా 35మంది ముఖ్యమైన టీఎంసీ నేతలు పార్టీని వీడి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.